
ప్రజావాణిలో సమస్యల ఏకరువు
హన్మకొండ : తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రావీణ్య, రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, ఆయా శాఖల అధికారులు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. రేషన్ కార్డులు మంజూరు చేయాలని, కుటుంబీకుల పేర్లు మార్పులు, చేర్పులపై, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ ప్రావీణ్య వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అక్షయ పాత్రకు అప్పగించొద్దు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్రకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. 2002 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెడుతున్నామని, ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు, గౌరవ వేతనం రాకున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులకు భోజనాన్ని నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. విద్యాశాఖ అధికారులు అక్షయ పాత్రకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, వెంటనే విరమించుకోవాలని కోరారు.
రేషన్‌కార్డులు, ఇళ్లు మంజూరు
చేయాలని వినతులు
ఫిర్యాదులు స్వీకరించిన హనుమకొండ
కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు