
వీర జవాన్లు అమర్ రహే..
● వేయిస్తంభాల ఆలయం నుంచి
కాగడాల ర్యాలీ
హన్మకొండ చౌరస్తా /హన్మకొండ: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైన తెలుగుతేజం మురళీనాయక్, మరెందరో జవాన్ల విరోచిత పటిమను స్మరిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక చేతిలో కాగడా, మరో చేతిలో జాతీయ జెండాలతో యువకులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, మురళీనాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాకేశ్‌రెడ్డి భారత సైన్యానికి రూ.25 వేల చెక్కును అందజేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వంద శాతం విజయవంతమైందని రాకేశ్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ సోల్జర్ ప్రభాకర్, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, ఇండస్ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు.