
భూసేకరణ త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో నుంచి వెళ్తున్న 163 (జీ) గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జాతీయ రహదారి 163 (జీ), కాలా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, సీజీఎంఆర్వో శివశంకర్, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శి హరిచందన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రెండో దశ ప్రాజెక్టులో భాగంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. సరస్వతీ పుష్కరాల తర్వాత భూసేకరణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి భూసేకరణపై ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. సమావేశంలో జాతీయ రహదారుల శాఖ వరంగల్, ఖమ్మం ప్రాజెక్టు డైరెక్టర్లు దుర్గాప్రసాద్, దివ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగేంద్రరావు, ఈఈ సురేశ్‌బాబు, ఆర్డీఓలు ఎన్.రవి, ఉమారాణి, సత్యపాల్‌రెడ్డి, రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు, జాతీయ రహదారుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన