
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు ఇబ్బంది పడేలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.. మందుబాబులను హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాల ముందు, రోడ్డుపై మద్యం సేవిస్తుండడంతో వచ్చిపోయే ప్రజలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్న తీరుపై ఈ నెల 4వ తేదీన సాక్షిలో ప్రత్యేక విజిట్ కథనం ప్రచురితమైంది. దీంతోపాటు పోలీసులకు పలు ఫిర్యాదులు రావడంలో సీపీ స్పందించారు. బహిరంగ మద్యపానంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పగలు, రాత్రి సమయాల్లో మద్యం దుకాణం పరిసరాలతోపాటు నిర్మానుష్య ప్రదేశాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, మనుషులు నివాసం లేని పురాతన భవనాల్లో తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 221 మంది మందుబాబులను అదుపులోకి తీసుకొని వారిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా జనగామ డివిజన్ పరిధిలో 57 కేసులు నమోదు కాగా, హనుమకొండ డివిజన్ పరిధిలో 42 , ఘన్‌పూర్ 40, కాజీపేట 24, వర్ధన్నపేట 24, నర్సంపేట 24, వరంగల్ 10 కేసులు నమోదైనట్లు వివరించారు. మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరూ బహిరంగంగా మద్యం సేవించకుండా దుకాణ యజమానులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
పెగడపల్లి డబ్బాల్ జంక్షన్ వద్ద..
నయీంనగర్: గురువారం రాత్రి పెగడపల్లి డబ్బాల్ జంక్షన్ వద్ద ఉన్న వైన్స్ పక్కనే ఉన్న ఇళ్ల ముందు కూర్చుని మద్యం సేవిస్తున్న 23 మంది మందుబాబులను హనుమకొండ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ మద్యం సేవిస్తూ మహిళలకు, యువతులకు, పాదచారులకు, చుట్టు పక్క ఇళ్ల వారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు