ప్రతీ పేదవాడికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

ప్రతీ పేదవాడికి అండగా ఉంటాం

May 8 2025 12:34 AM | Updated on May 8 2025 12:34 AM

ప్రతీ

ప్రతీ పేదవాడికి అండగా ఉంటాం

వాజేడు/వెంకటాపురం(కె) : ప్రతీ పేదవాడికి అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పబ్లిక్‌ రిలేషన్స్‌, కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) ఏజెన్సీ మండలాల్లో ఆయన బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాపురం(కె) మండల కేంద్రంలోని ఇంజనీరింగ్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, పాత్రాపురం గ్రామంలో రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దున ఉన్న టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా పలు ఇళ్లకు భూమిపూజ చేశారు. వాజేడు మండల కేంద్రంలోని నాగారం గ్రామం నుంచి పాయబాటలు గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఏడ్జెర్లపల్లి నుంచి బొమ్మనపల్లి వరకు రూ.3 కోట్లతో నిర్మించే బీటీ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఎంపీడీఓ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. పది నెలల కాలంలోనే 57, 662 ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. భూభారతి చట్టం పేదరైతులకు చుట్టంగా మారిందని అన్నారు. రాజీవ్‌ యువవికాసం పథకంలో జూన్‌ 2న రూ.6వేల కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడిన అనంతరం నూతన పథకాలు అమలు చేస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మారుమూల టేకులగూడెం నుంచే అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతామన్నారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్‌ భార్య రాంబాయి, కూలి పనులను చేసుకునే ఉయిక అర్జున్‌ భార్య సావిత్రి మంత్రి పొంగులేటి శ్రీనువాస్‌రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అందలేదని చెప్పారు. స్పందించిన ఆయన త్వరలోనే వచ్చేలా చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా టేకులగూడెం వద్ద రైతులు మంత్రిని సన్మానించి నాగలిని బహూకరించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ శబరీష్‌, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ కుమార్‌ ఆధ్వర్యంలో టేకులగూడెం వరకు రహదారి వెంట పోలీసు బలగాలు భద్రతగా ఉన్నాయి. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ఎస్పీ శబరీశ్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదవ, ఆర్డీఓ వెంకటేష్‌, ప్రత్యేకాధికారి సర్ధార్‌ సింగ్‌, తహసీల్దార్‌ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఏజెన్సీలో పలు అభివృద్ధి పనులకు

శంకుస్థాపన

ప్రతీ పేదవాడికి అండగా ఉంటాం1
1/1

ప్రతీ పేదవాడికి అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement