
తెలుగు భాషా వికాసాన్ని అడ్డుకోవడం సరికాదు
హన్మకొండ కల్చరల్ : తెలుగు భాషా వికాసాన్ని అడ్డుకోవడం సరికాదని కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో రెండవ ఆప్షన్‌గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ జారీచేసిన జీవోను వ్యతిరేకిస్తూ బుధవారం హనుమకొండ పింజర్లరోడ్‌లోని రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయంలో తెలుగుభాషా పరిరక్షణకు నిర్వహించిన చర్చా గోష్టిలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, కవులు, రచయితలు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు భాషను పాలకులు నిర్లక్ష్యం చేయడం విచారకరమైన విషయమని అంశపశయ్య నవీన్ అన్నారు. మాతృభాషను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని పొట్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో గిరిజామనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, బిల్ల మహేందర్, పి, చందు, వీఆర్ విద్యార్థి తదితరులు పాల్గొన్నారు.
కేయూ విశ్రాంతాచార్యులు
బన్న అయిలయ్య