
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
కేయూ క్యాంపస్ : ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపి వేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి యూనివర్సిటీ మొదటి గేట్ వరకు శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న భారత్ బచావో బాధ్యుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాంబ్రహ్మం మాట్లాడుతూ దండకారణ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ని ఆపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అపార ఖనిజ సంపద కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను, ఆదివాసీలను లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను చేపట్టిందని ఆరోపించారు. ర్యాలీలో డీఎస్‌ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, బీఎస్‌ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు శివ, భారత్ బచావో బాధ్యులు వెంగల్ రెడ్డి, రాజా మహ్మద్, సదానందం, అరసం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మార్క శంకర్ నారాయణ, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఉప్పుల శివ, మహేష్, రాజేష్, శివ, సన్నీ పాల్గొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి
కేయూలో విద్యార్థి సంఘాల ర్యాలీ