
డెడ్‌లైన్.. సెప్టెంబర్ 30
సాక్షి, వరంగల్: ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్‌ఎన్‌పీ) అమర్చుకోవాల్సిందే. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ చివరన ఉన్న లేజర్ కోడ్‌ను ట్రాక్ చేసి వాహనదారుడి పేరు, వివరాలు తెలుసుకోవచ్చు. వాహనం ధ్వంసమైన సందర్భంలో కూడా లేజర్ కోడ్ ద్వారా వెంటనే వివరాలు తెలుసుకునే వీలుంటుంది. ఇలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులను సులువుగా గుర్తు పట్టేలా ఉన్న హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు బిగించుకోవాలి. ఈ లెక్కన చూసుకుంటే 2019 మార్చి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న 37,045 అన్ని రకాల పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాల్సిందేనని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే 2019 ఏప్రిల్ ఒకటి తర్వాత తయారైన వాహనాలకు ఇప్పటికే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ నిబంధన అమలవుతోంది. 2019 మార్చి 31 వరకు ఉన్న పాత వాహనాలన్నింటికి సాధారణ నంబర్ ప్లేట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని తొలగించి ప్రస్తుతం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోకపోతే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ ధ్రువపత్రం తదితర సేవలు నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు.
బిగించుకున్నాక ఫొటో తీసి
అప్‌లోడ్ చేయాలి..
వాహనం నంబర్ ప్లేట్‌పై ఏమైన నంబర్లను ఇష్టమైన రీతిలో ముద్రించుకుంటామంటే ఇకపై కుదరదు. నూతన, పాత వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలి. జిల్లా రవాణాశాఖలో వివిధ సేవలకు వచ్చే పాత వాహనదారులకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉంటేనే సేవలను అందిస్తామని రవాణాశాఖ స్పష్టం చేస్తోంది. ఇవి బిగించుకోవడానికి వాహన యజమానులు www. siam. inలో వాహన వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం వచ్చిన కొత్త నంబర్ ప్లేట్‌ను బిగించాక ఫొటో తీసి అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నిబంధనలు విధించారు. అదే సమయంలో వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్ చార్జీలను ఖరారు చేశారు. కనిష్టంగా రూ.320 నుంచి గరిష్టంగా రూ.860గా నిర్ణయించింది.
లేకుంటే సేవలు బంద్..
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించకుంటే వాహనం అమ్మాలన్నా.. రవాణాశాఖలో పేరు మార్పు చేయాలన్నా ఇక సాధ్యం కాదు. బీమా, పొల్యూషన్ ధ్రువ పత్రాలు జారీ చేయం. సెప్టెంబర్ 30 గడువు తీరాక రవాణాశాఖ అఽధికారుల తనిఖీల్లో దొరికితే కేసులు నమోదు చేస్తాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జీఓ వచ్చింది. అయితే, ఇంకా విధివిధానాలు రావాలి. అవి వచ్చాక దాని ప్రకారం అమలు చేస్తాం.
– శోభన్‌బాబు, జిల్లా ఇన్‌చార్జ్ ఆర్టీఓ, వరంగల్
గడువులోగా పాత వాహనాలకు హై
సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలి
లేదంటే ఇన్సూరెన్స్, పొల్యూషన్
పత్రాలు ఇవ్వరు
రవాణాశాఖ దాడుల్లో దొరికితే
కేసులు నమోదు
వరంగల్ జిల్లాలో 2019, మార్చి 31 వరకు ఉన్న వెహికిల్స్ 37,045

డెడ్‌లైన్.. సెప్టెంబర్ 30

డెడ్‌లైన్.. సెప్టెంబర్ 30