
మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కొనసాగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల అధ్యయన శిబిరం మంగళవారం డివిజన్ కేంద్రంలోని నితిన్ భవన్‌లో ముగిసింది. ఈసందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దయాకర్‌రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక పాల్గొన్నారు. వీఎంఎఫ్ వ్యవస్థాపకులు తక్కెళ్లపల్లి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు 50 రోజుల పాటు తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసతి, భోజనంతో కూడిన వార్షిక పరీక్షల అధ్యయన శిబిరం నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ ఫౌండేషన్‌లో బాలికల వసతికై రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకై విద్యార్థులు కృషి చేయాలని కోరారు.
మంత్రి దయాకర్‌రావు