డీఎస్ నకార సేవలు చిరస్మరణీయం
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
మంగళగిరి టౌన్: విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన డీఎస్ నకార సేవలు చిరస్మరణీయమని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని పెన్షనర్స్ హోమ్‌లో జాతీయ పెన్షనర్ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ పితామహులు డీఎస్ నకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో డీఎస్ నకార తన కర్తవ్యంగా న్యాయస్థానానికి వెళ్లారని గుర్తుచేశారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని.. ఆనాటి నుంచి పెన్షనర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా మంగళగిరిలో నకార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిచ్చయ్య, కృష్ణయ్య, మంగళగిరి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


