కార్టూనిస్ట్ సుభానీకి ‘బాపు’ అవార్డు
కారంచేడు: ప్రముఖ కార్టూనిస్ట్‌గా, అనతికాలంలోనే కార్టూన్ ఎడిటర్‌గా అంచలంచలుగా ఎదిగిన పొలిటికల్ కార్టూనిస్ట్ షేక్ సుభానీకి ‘బాపు అవార్డు’ దక్కింది. కారంచేడు గ్రామానికి చెందిన సుభానీ షేక్ గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. కార్టూన్ ఎడిటర్‌గా.. ఎన్నో పొలిటికల్ కార్టూలను వేసి అనేక మంది మన్ననలు పొందారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని బాపు–రమణ అకాడమీ వారు గుర్తించి సుభానీకి బాపు అవార్డును అందించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు రమణ అవార్డు, సినీ నటుడు మురళీమోహన్‌కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. సుభానీకి పలువురు అభినందనలు తెలిపారు.


