మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
గుంటూరువెస్ట్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడదామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, కళాశాలలలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని, ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెద్దఎత్తున అవగాహన కల్పించి మత్తు, మాదక ద్రవ్యాల వలన ఆరోగ్యంపైనా, ఆర్థికంగాను పడే ప్రభావాలు తెలియజేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నామన్నారు. 839 ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, అధికారులు పాల్గొన్నారు.
వరకట్న వేధింపులపై అవగాహన పెంచాలి
వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువతలో ఎక్కువ అవగాహన కల్పించాలని అన్నారు.


