తుఫాన్ నష్టంపై నివేదిక అందజేయాలి
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా
గుంటూరు వెస్ట్: మోంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక వీలైనంత త్వరగా అందజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్.పి.సిసోడియా అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికారులతో కలసి నిర్వహించిన సమావేశంలో సిసోడియా మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి తుఫాన్ నష్ట అంచనాలను సేకరించి నివేదికను త్వరగా అందజేయాలన్నారు. రైతులకు నష్టపరిహారం త్వరగా అందజేయాలంటే ఎన్యుమరేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఒక వ్యక్తి అయితే వెయ్యి రూపాయలు, ముగ్గురు ఆపై సభ్యుల కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలన్నారు. బియ్యం, నూనె, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, పామ్ ఆయిల్‌తో కూడిన కిట్టు అందించాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలలో ఉన్న వారి వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని సిసోడియా తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ వర్షాల వలన కెనాల్స్ ఓవర్ ఫ్లో అయ్యాయని చెప్పారు. కెనాల్స్‌కు, ట్యాంకులకు ప్రమాదం లేదని వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి అయితా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 22 వేల హెక్టార్లలో పంట నష్టం అంచనాలపై శాస్త్రవేత్తల బృందంతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలో ఉన్నారన్నారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామాలలో శానిటేషన్ , సూపర్ క్లోరినేషన్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 228 ట్యాంకులను క్లోరినేషన్ చేశామని వివరించారు. అక్కడక్కడా గ్రామాలలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, పశు సంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణ, డీఏంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఏ.పి.ఏం.ఐ.పి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎల్.వజ్రశ్రీ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కె.కళ్యాణ్ చక్రవర్తి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి. చెన్నయ్య పాల్గొన్నారు.


