పంటల సంరక్షణలో జాగ్రత్తలు అవసరం
కొరిటెపాడు(గుంటూరు): తుఫాన్ ముంపునకు గురైన పంటల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ గుంటూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు అన్నారు. రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. పత్తి రైతులు వీలైనంత త్వరగా నీరు తొలగించి అంతర కృషి చేసి, నేల ఆరేలా చేయాలన్నారు. అధిక తేమ వల్ల మొక్కలు భూమి నుంచి పోషకాలను గ్రహించే స్థితిలో వుండవని, అటువంటి పరిస్థితులలో మొక్కలు ఎర్రబడటం, వడలటం, ఎండిపోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నివారణకు 20 గ్రాములు యూరియా లేదా 20 గ్రాములు పొటాషియం నైట్రేట్‌ను 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్‌తో లీటరు నీటికి కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధితో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలని సూచించారు. ఎండ ఉన్న సమయంలో మాత్రమే పిచికారి చేయాలని, చల్లగా ఉన్న సమయంలో పిచికారి చేస్తే, నీటి ముంపునకు గురైన మొక్కలు పోషకాలను సమర్ధవంతంగా తీసుకోలేవని తెలిపారు. రెండు శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారి చేయటం ద్వారా పొటాషియం, నత్రజని లోపాలను సవరించవచ్చన్నారు. గాలిలో తేమ ఎక్కువగా వుండటం వలన పురుగులు, తెగుళ్ల వ్యాప్తి చెందటానికి అవకాశం వుందని, అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా లీటరు నీటికి మూడు గ్రాముల మాంకోజెట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలని చెప్పారు. తెగులు సోకిన పొలంలో లీటరు నీటికి 1 మి.లీ ప్రొపికొనజోల్ లేక కాప్టాను, 1 గ్రా హెక్సాకొనజోల్ కలిపి 15 రోజుల వ్యవధిలో చల్లుకోవాలని సూచించారు.
పత్తి పంటలో..
పత్తిలో కాయకుళ్లు నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయాలన్నారు. పొటాషియం నైట్రేట్‌ను ఏదైనా పురుగుమందు లేదా తెగులు మందులోనైనా కలిపి పిచికారి చేసుకోవచ్చని సూచించారు. పత్తి పంటను ఎటువంటి పరిస్థితుల్లో కూడా 150 నుంచి 160 రోజుల తర్వాత పొడిగించరాదని స్పష్టం చేశారు. పత్తి మోళ్లను షెడ్డరుతో భూమిలో కలియ దున్నుకోవాలని పేర్కొన్నారు.
పెరుగుదల దశ వరి పైరులో..
వరి పైరులో ముంపు నీటిని వీలైనంత త్వరగా బయటికి పంపించాలని సూచించారు. ఒక ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలన్నారు. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువ కావడానికి అవకాశం ఉందని, ఈ తెగులు దుబ్బు చేసిన దశ నుంచి ఆకులపై మచ్చలు ఏర్పడతాయన్నారు. ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోతాయని, నివారణకు ప్రొసికొనజోల్ ఒక మి.లీ లేదా వాలిడామైసిన్ లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి డబ్బు బాగా తడిచేలా 15 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలని సూచించారు. ముంపు పరిస్థితులు నెలకొన్నప్పుడు అగ్గి తెగులు ఉధృతికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని, అగ్గి తెగులు సోకినప్పుడు ముదురు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎర్రబడతాయని తెలిపారు. క్రమేణా మచ్చలు కలిసిపోయి పంట ఎండిపోయినట్లు ఉంటుందన్నారు. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా క్లాసుగామైసిన్ 2 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరిలో జింక్ లోపం ఉంటే వరి నాటిన రెండు నుంచి ఆరు వారాల్లో ముదురు ఆకు చివర్లలో ఈనేకు ఇరుప్రక్కల త్రుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనపడతాయన్నారు. ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయని తెలిపారు. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవని, లీటరు నీటికి రెండు గ్రాములు జింక్ సల్ఫేట్‌ను కలిపి మూడు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలని వివరించారు.
పొట్ట దశలో వరి పైరుకు..
పొలాల్లో ముంపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలని కోరారు. వాలిపోయిన చేనులో నాలుగైదు దుబ్బులు చొప్పున కలిపి కట్టి పైరుని నిలబెట్టాలని సూచించారు. లేవదీసి కట్టిన చేనుకు పొడ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీని నివారణకు ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేక వాటిలామైసిన్ 2 మి.లీ. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి డబ్బు బాగా తడిచేలా 15 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలన్నారు. వరి పొలంలో అధిక నీటి ప్రవాహం తర్వాత సుడి దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దోమ ఉధృతి ఎక్కువైనప్పుడు నివారణకు 2 మి.లీ ఇతోఫెనాక్స్ లేదా 1.5 గ్రా. ఎసిపేట్ లేదా 0.25 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.20 గ్రాముల థయోమిథోక్సామ్ లేదా 0.25 గ్రా. డైనెటోఫ్యురాన్ లేదా 1.6 మి.లీ. బిప్రొఫ్యూజిన్ లేదా 0.6 మి.లీ. పైమెట్రోజన్ లేదా 2.2 మి.లీ. మోనోక్రోటోఫాస్ చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని వివరించారు. పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలని సూచించారు.
వరి పంట కోత దశలో..
కోతకు ముందు వర్షాలు వస్తే వరి వెన్నుల మీద ఐదు శాతం 50 గ్రాములు ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పైరు పనల మీద తడిస్తే 50 గ్రాములు ఉప్పు ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి వెన్నులపై పిచికారి చేయాలని లేదా ఎకరానికి 10–15 కిలోల మెత్తటి ఉప్పును పనలపై చల్లాలని, ఇలా చేస్తే 10–15 రోజుల వరకు గింజలు పాడవ్వకుండా ఉంటాయన్నారు. ఉప్పు ద్రావణం పిచికారి వీలుకాని పక్షంలో తడిచిన పనలను ఆరనిచ్చి కుప్పలుగా వేసేటప్పుడు ఉప్పు పొడిని కంకుల మీద చల్లాలని సూచించారు. నూర్చిన తర్వాత వరి ధాన్యం తడిస్తే క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 4 కిలోల ఊక లేదా ఎండుగడ్డి చిన్న చిన్న ముక్కలుగా చేసి కలిపి కుప్పగా పోసి వారం రోజుల తర్వాత అరబెట్టాలని ఆయన వివరించారు.


