7 నుంచి వీవీఐటీయూ ‘బాలోత్సవ్’
పెదకాకాని/నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీయూ బాలోత్సవ్ – 2025ను వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఆదివారం గుంటూరులోని వీవీఐటీయూ కార్యాలయంలో ప్రచార ప్రతులను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇది ఒక మంచి వేదిక అన్నారు. 2017 నుంచి బాలోత్సవ్‌ను నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. గతేడాది రోజూ పది వేల మంది బాలబాలికలు వచ్చారని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయం, విశిష్టతను ముందు తరాలకు చెప్పడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు.
సాంస్కృతిక, సాంకేతిక అంశాల్లోనూ..
రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వం, నైపుణ్యం పెంపొందించేందుకు బాలోత్సవ్ వేదిక అన్నారు. సాంస్కృతిక, సాంకేతిక అంశాల్లోనూ పోటీలు ఉంటాయని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీసీ, శాక్ విద్యార్థులు హాజరయ్యే చిన్నారులకు సహకారం అందిస్తారని చెప్పారు. బాలోత్సవ్ విద్యార్థి సంధానకర్త టి.నవ్య మాట్లాడుతూ ఈ పోటీలను మూడు రోజుల్లో ఇరవై అంశాలు, అరవై విభాగాలుగా చేపడతామని అన్నారు. వచ్చే వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్‌లకు వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ ఫారాలను పూర్తి చేసి పోస్టు ద్వారా పంపవచ్చునని అన్నారు. వెబ్‌సైట్లోని గూగుల్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ బటన్ నొక్కడం ద్వారా అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు బాలోత్సవ్ సంధానకర్త నందిరాజు శివరామకృష్ణను 73862 25336 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు. వీవీఐటీయూ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ పవన్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.


