
అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి
అమరావతి: ప్రపంచానికి పురాణాలను అందించింది వేదవ్యాస భగవానుడైతే వాటిని సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచించిన అభినవ వ్యాసుడు పురాణ ప్రవచన సార్వభౌముడు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి అని ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి అన్నారు. శనివారం రాత్రి స్థానిక యోగాశ్రమంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి శత జయంతి వర్ష సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు మల్లాది రామనాఽథశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నోరి నారాయణమూర్తి మాట్లాడుతూ దేశ, విదేశాలలో పురాణప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మాత్రమేనన్నారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టువల్ల పురాణ ప్రవచన ప్రముఖుల్లో ప్రథములుగా గుర్తించబడ్డారన్నారు. నాటి కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పేరోజులనుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఆడిటోరియంలో చెప్పే వరకు సమారు 70 సంవత్సరాల మల్లాదివారి సుదీర్ఘ ప్రవచన ప్రయాణం సాగిందని తెలిపారు.
● శనగవరసు రామ్మోహనశర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి అమరావతి ఆణిముత్యమన్నారు.
● మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ అమరావతిలోనే చంద్రశేఖరశాస్త్రి బాల్య విద్యాభ్యాసం గడవడంతోపాటు, తొలిరోజుల పురాణ ప్రవచనం ఇక్కడే చేసి, ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి మరోసారి వన్నె తెచ్చారని కొనియాడారు.
● ప్రముఖ ప్రవచనకర్త పుల్లాభట్ల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో శృంగేరి శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడిగా పురాణాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో భక్తిభావతత్పరతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడు చంద్రశేఖరశాస్త్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రశేఖరశాస్త్రి అనటంలో అతిశయోక్తి లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మందాడి చలపతిరావు, మల్లాది రామచంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక ప్రసాద్ మాట్లాడారు. ఈసభకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.
ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి