
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్‌లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్‌ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్‌చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ