
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్‌వర్దన్‌పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పనిచేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం, లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. కేవలం నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్‌వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు