
సమాజంలో ఉత్తమ వైద్యులుగా సేవలందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య రంగంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థి అందిపుచ్చుకుని సమాజంలో ఉత్తమ వైద్యులుగా సేవలందించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భాష్యం మెడెక్స్ నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఎయిమ్స్, జిప్‌మర్ వంటి సంస్థల్లో సీట్లు సాధించి వైద్యవిద్యనభ్యసించడం అభినందనీయమని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. వైద్యవృత్తిలో నైపుణ్యం సాధించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం మెడెక్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు సీట్లు సాధించి ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల ద్వారా వైద్యవిద్యనభ్యసించి దేశ, విదేశాల్లో ఉత్తమ వైద్యులుగా రాణించడం ఒక గురువుగా తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. భాష్యం విద్యార్థులు ప్రపంచం నలుమూలలా భాష్యం ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను భాష్యం రామకృష్ణ దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం మెడెక్స్‌లో విద్యనభ్యసించిన 300 మంది వైద్య విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్