
ప్రాణం తీసిన ఈత సరదా
బీటెక్ విద్యార్థి మృతి
తాడేపల్లిరూరల్ : బంధువుల ఇంటికి వచ్చి సరదాగా ఈత కొడదామని కృష్ణానదికి వెళ్లి నీటిలో మునిగిపోయి బీటెక్ విద్యార్థి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తాడేపల్లి ఎస్‌ఐ సాయిప్రసాద్ కథనం ప్రకారం.. గుంటూరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన వాసుబాబు కుమారుడైన టి.అవినాష్ (19) గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు కావడంతో తాడేపల్లి మహానాడులోని బంధువుల ఇంటికి వచ్చి ఆదివారం సాయంత్రం సరదాగా దిగువ ప్రాంతంలోని పుష్కర ఘాట్‌ల వద్ద ఈతకు వెళ్లాడు. అందరూ పైన కూర్చుని ఉండగా, అవినాష్ మరో యువకుడు నదిలోకి దిగారు. ఈ సమయంలో అవినాష్ నీటిలో మునిగిపోయాడు. స్థానిక మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో అవినాష్‌ను బయటకు తీశారు. అయితే అతను అప్పటికే మృతిచెందాడు. ఘటనపై అవినాష్ తండ్రి వాసుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రసాద్ తెలిపారు.
లారీని ఢీకొన్న
మినీ బస్– ఆరుగురికి గాయాలు
గుంటూరు రూరల్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మినీ బస్ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అంకిరెడ్డిపాలెం సమీపంలోని హైవేపై సోమవారం జరిగింది. సీఐ నరేష్‌కుమార్ కథనం ప్రకారం విశాఖపట్నం సిటీలోని అక్కయ్యపాలెంకు చెందిన 20 మంది తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి మినీబస్‌లో ఇంటికి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున అంకిరెడ్డిపాలెం సమీపంలో హైవే పక్కనే ఆగి ఉన్న లారీని మిని బస్ ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో అందరూ నిద్రావస్థలో ఉన్నారు. ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందుభాగం దెబ్బతింది. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించి మరో బస్‌లో ఇళ్ళకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా