గోగులమ్మను తాకిన సూర్య కిరణాలు

- - Sakshi

పెదపులివర్రు(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువు తీరిన గోగులమ్మ అమ్మవారిని మంగళవారం సూర్యనారాయణ స్వామి వారి కిరణాలు తాకాయి. ఉదయం 7:13 గంటల నుంచి పావు గంటపాటు ఈ కిరణాలు అమ్మవారిని తాకినట్లు అర్చకులు దీవి గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు. ప్రతి ఏటా నాలుగైదు సార్లు సూర్యకిరణాలు అమ్మవారిని ఇలా తాకుతాయని ఆయన పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

నెహ్రూనగర్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్‌ అసిస్టెంట్‌(2), జూనియర్‌ స్టెనో(1), టైపిస్ట్‌(3), స్టోర్‌ కీపర్‌(1), ఆఫీస్‌ సబార్టినేట్‌(8), మేసేంజర్‌(2), ల్యాబ్‌ అసిస్టెంట్‌(1), ల్యాబ్‌ అటెండర్‌(1), వర్క్‌ షాప్‌ అటెండర్‌(1), స్కిల్డ్‌ వర్క్‌ మ్యాన్‌(1), ఫిషర్‌ మ్యాన్‌(1), శానిటరీ మేసీ్త్ర(1), వాచ్‌మాన్‌(9), వాటర్‌ మ్యాన్‌(1), స్వీపర్‌(3), పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌(12), గ్యాంగ్‌ మజ్దూర్‌(2), డ్రెయిన్‌ క్లీనర్‌(1), కళాసీ(1), హోల్‌ టైమ్‌ సర్వెంట్‌(1), లస్కర్‌(1) చొప్పున మొత్తం 54 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 11వ తేదీ వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌ https://www.gunturap.in/2023.

జుమ్మా మసీదు @150

అప్పట్లో గుంటూరు తర్వాత

భట్టిప్రోలులోనే మసీదు

భట్టిప్రోలు: భట్టిప్రోలు ప్రధాన రహదారిలోని జుమ్మా మసీదుకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో జమాలుద్దీన్‌ ఈ మసీదును నిర్మించారు. ఆ కాలంలో జిల్లాలో గుంటూరు తర్వాత భట్టిప్రోలులోనే మసీదు ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఇక్కడకు గుర్రాలపై వచ్చేవారని పెద్దలు చెబుతుంటారు. నమాజుకు వచ్చిన వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసేవారని చెబుతున్నారు. జుమ్మా మసీదుకు ఎదురుగా ఉన్న గదులు ప్రార్థ్దన చేసేందుకు వచ్చేవారు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించేవారు. గుర్రాలు నిలుపుదల చేసేందుకు ఈ భవనం కిందగా దారి ఉండేది. ఇప్పుడు అక్కడ దుకాణాలు వెలిశాయి. ఈ మసీదు ఏర్పడ్డాకే జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మసీదులు ఏర్పాటు చేసినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఐదు పూటలా నమాజులు, ప్రత్యేక ప్రార్థ్దనలు చేస్తున్నారు. రంజాన్‌ మాసంలో ఉపవాసాలతో పాటు తరాబే నమాజులు జరుగుతాయి.

మిర్చి యార్డుకు 1,21,132 బస్తాల మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి మార్కెట్‌ యార్డుకు మంగళవారం 1,21,132 బస్తాలు వచ్చాయి. గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,15,421 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.25,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.26,500 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 87,722 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top