
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించనని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అన్నారు. మంగళవారం జీజీహెచ్‌కు తన సొంత నిధులతో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లను ఆయన అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతితో వివిధ సమస్యలపై సమీక్షించారు. సిటీ స్కాన్ వైద్య పరికరంలో ఆసుపత్రిలో ఒక్కటే ఉందని, మరొకటి కావాలని, ఈఎన్‌టీ వైద్య విభాగంలో ఆడియాలజీ పరికరం కావాలని, కార్డియాలజీ విభాగంలో మత్తు వైద్యుల కొరత ఉందని, ఎక్సరే ఫలితాలను వైద్యుల వద్దకు పంపేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కావాలని, దంత వైద్య విభాగంలో డిజిటల్ ఎక్సరే మిషన్ కావాలని, అత్యవసర విభాగంలో మరొక ఆపరేషన్ థియేటర్ కావాలని, ఐదు లిఫ్ట్‌లకు రెండు మాత్రమే పనిచేస్తున్నాయని ఆసుపత్రిలో ఉన్న సమస్యలను డాక్టర్ ప్రభావతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, కొద్దిపాటి మరమ్మతులకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దాతల సాయంతో కొద్దిపాటి పరికరాలు, కుర్చీలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దాతలు సహకరించాలని కోరారు. జనరల్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ వార్డు, కాన్పుల వార్డు, చిన్న పిల్లల వార్డుల్లో తిరిగి అక్కడి సమస్యల గురించి సిబ్బంది, రోగులను అడిగి తెలుసుకున్నారు. కాన్పుల విభాగంలో డబ్బులు అడుగుతున్నారని కొందరు ఫిర్యాదులు చేయడంతో ఎమ్మెల్యే ముస్తఫా సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వార్డుల్లో ఏసీలు పని చేయకపోవడంతో వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న పిల్లల వార్డును పరిశీలించి తల్లిబిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బత్తుల వెంకట సతీష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముస్తఫా