ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ఆరో రోజైన సోమవారం కాగడా మల్లెలు, జాజులు, మరువంతో అర్చన నిర్వహించారు. విశేష పుష్పార్చన నిమిత్తం తీసుకువచ్చిన పుష్పాలతో ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ భ్రమరాంబలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పుష్పార్చన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి నిర్వహించిన విశేష పుష్పార్చనలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. పూజ అనంతరం అమ్మవారికి పంచహారతులు, నివేదన సమర్పించారు. పుష్పార్చన అనంతరం పుష్పాలను అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేశారు.
నేడు దేవదాయ శాఖ మంత్రి రాక..
ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారికి ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరు పూలు, సన్న జాజులతో అర్చన జరుగుతుంది. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొంటారని అర్చకులు పేర్కొన్నారు.