
గుంటూరు వెస్ట్: పేదల ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం అద్భుతమని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి కొనియాడారు. జిల్లాకు అదనంగా వచ్చిన నాలుగు 104 వాహనాలను స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిర ఆవరణలో సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 104 వాహనాలు 17 ఉన్నాయని కొత్తగా వచ్చిన నాలుగుతో కలపి 21 అవుతాయని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన నాలుగు వాహనాలను మంగళగిరి, తాడేపల్లి, ప్రత్తిపాడు ప్రాంతాల్లో ఉపయోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయని వివరించారు. అధికారులు, సిబ్బంది ప్రజలు ఉత్తమ సేవలందిస్తే దానికి ప్రతిఫలం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, డీఎంంహెచ్‌ఓ డాక్టర్ శ్రావణ్ బాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి దేవి, సోషల్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ గణిక ఝాన్సీ పాల్గొన్నారు.
వృద్ధుడికి కళ్లజోడు ఇప్పించిన కలెక్టర్
గుంటూరు వెస్ట్: వైఎస్సార్ కంటి వెలుగు పథకంలో భాగంగా వృద్ధులు అవసరం మేరకు కళ్లజోళ్లు పొందాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో దుగ్గిరాల గ్రామానికి చెందిన జి.చెన్నయ్య(72) తనకు కళ్లజోడు కావాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందించి అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పిలిపించి పరీక్షలు నిర్వహించి కళ్లజోడు ఇప్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు పాల్గొన్నారు.