
గురజాల: స్థానిక సబ్‌జైలును జూనియర్ సివిల్ జడ్జి కె.మంజులత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలు తాగునీటి వసతి సరిగ్గా లేదని జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన జడ్జి నీటి శుద్ధి యంత్రానికి మరమ్మతులు నిర్వహించి ఖైదీలకు తాగునీటిని అందించాలని ఆదేశించారు. అదే విధంగా ఖైదీలకు వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదుల బాక్స్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట న్యాయవాది కలివెల ప్రభుదాసు ఉన్నారు.
మిర్చి యార్డుకు
92,254 బస్తాల రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు 92,254 మిర్చి బస్తాలు వచ్చాయి. గత నిల్వలతో కలపి ఈ–నామ్ విధానం ద్వారా 89,659 బస్తాలు కొనుగోళ్లు జరిగింది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.24,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.27,000 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 82,011 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
వైద్యసిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి
నరసరావుపేట: ప్రతి ఒక్కరూ రీ–ఓరియంటేషన్‌ను వినియోగించుకొని లక్ష్యాలను వందశాతం సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి జి.శోభారాణి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తన కార్యాలయంలో జిల్లా గణాంక విభాగం ద్వారా జిల్లాలోని అన్నీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోని ఏఎన్‌ఎంలకు చేపట్టిన పదిరోజుల శిక్షణను ప్రారంభించారు. మొదటిరోజు నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల ఏఎన్‌ఎంలకు ఆర్‌సీహెచ్, ఏఎన్‌ఎంఓఎల్ ప్రోగ్రాము, సీఎస్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎంఐఎస్ రిపోర్టింగ్ ఫార్మెట్స్, యాప్‌లపైన శిక్షణతో పాటు ఆన్‌లైన్ సర్వీసులను పూర్తిగా వందశాతం వినియోగించుకొని ఫలితాలు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ జి.చంద్రశేఖర్, డాక్టర్ హనుమకుమార్ పాల్గొన్నారు.
ఐదుగురిపై
మాల్ ప్రాక్టీస్ కేసులు
గుంటూరు ఎడ్యుకేషన్: సీనియర్ ఇంటర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్–2 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల పరిధిలో కేటాయించిన 43,613 మంది విద్యార్థుల్లో 42,468 మంది విద్యార్థులు సోమవారం పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. మాచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిలకలూరిపేటలోని సీఆర్ జూనియర్ కళాశాలలో ఇద్దరు చొప్పున, ఏఎంజీ జూనియర్ కళాశాలలో ఒకరు పట్టుబడ్డారు.

