టీడీపీ నేతలు సంప్రదించారు..

తనకు ఫోన్‌ చేసిన టీడీపీ నేతల కాల్‌లిస్ట్‌ను చూపిస్తున్న ఎమ్మెల్యే గిరిధర్‌ - Sakshi

పట్నంబజారు: ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు సంప్రదించారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ వెల్లడించారు. గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిధర్‌ మాట్లాడారు. తనను కలిసిన స్థానిక నేతలు టీడీపీ పెద్దలతో మాట్లాడిస్తామని చెప్పారని, మద్దతుగా ఓటు వేయాలని కోరినట్లు వివరించారు. పలువురు టీడీపీ పెద్దలు స్వయంగా ఫోన్‌ చేసినప్పటికి లిఫ్ట్‌ చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ తొండెపు దశరథ జనార్ధన్‌ తన కోసం ఫేస్‌టైం యాప్‌ ద్వారా పలుమార్లు ఫోన్‌ చేశారని చెప్పారు. వారం రోజులుగా తనను సంప్రదించే ప్రయత్నాలు చేసినా తాను స్పందించలేదని పేర్కొన్నారు. జనార్ధన్‌ ఫోన్‌ చేయడాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. తన ఓటు అవసరం లేదన్నవారు ఎందుకు ఫోన్‌ చేసినట్లు అని నిలదీశారు. రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు, కొనుగోలు రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కున్నారని దుయ్యబట్టారు. కనీస విలువ కూడా ఇవ్వని టీడీపీ నుంచి ప్రజలకు మంచి చేసేందుకు నలుగురం బయటకు వచ్చామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని చూసి టీడీపీని విడనాడామని చెప్పారు. జగమంత కుటుంబం అనేది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతమని పేర్కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే గతంలో టీడీపీలోకి ఎమ్మెల్యేలు వచ్చారని, కుళ్లు రాజకీయాలతో తమపైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ చేసిన ఎమ్మెల్యేలు ఉత్తరకుమార ప్రగల్భాలను తలపించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుళ్లు, కుతంత్రాలు, డబ్బు రాజకీయం తనకు ఏ మాత్రం అవసరం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. టీడీపీ నేతలు కక్ష సాధింపు, డైవర్షన్‌ రాజకీయాలు చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 16 మంది తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్న టీడీపీ నేతలు.. కేవలం రెండు క్రాస్‌ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పాలని నిలదీశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసిన ఎమ్మెల్యేలు కట్టుబడి ఓట్లు వేశారని చెప్పారు.

కొడుకు కోసం బాబు రాజకీయాలు..

అనుభవం లేని కుమారుడు లోకేశ్‌ కోసం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. కొడుకు భారాన్ని కార్యకర్తలపై రుద్దుతున్నారని, అతడి కోసం పార్టీని తగలబెట్టడం తథ్యమని చెప్పారు. పాదయాత్ర చూస్తే.. ప్రజాస్పందన ఎలా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు కేవలం నేను–నా వాళ్లు.. అనే పద్ధతిలోనే రాజకీయాలు చేస్తారని, ఆ స్వార్థం చూడలేక బయటకు వచ్చామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎలా జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, వారి వ్యక్తిత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉదయం కుమార్తెతో సహా సీఎం జగన్‌ను కలసి.. వెన్నుపోటు పొడవటం కొంతమందికే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. వారు చేసిన పనికి నెపాన్ని ఇతరులపై నెట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు. సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు లేదని సీఎం జగన్‌ స్పష్టంగా చెబుతున్నారు కాబట్టే.. ఇటువంటి నీచ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. అమరావతి రాజధాని అంశంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గతంలో ఏం మాట్లాడారో.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని మద్దాళి గిరిధర్‌ గుర్తు చేశారు.

స్థానిక నేతలు పెద్దలతో మాట్లాడిస్తామన్నారు టీడీపీ పెద్దల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి టీడీ జనార్ధన్‌ ఫేస్‌టైం యాప్‌ ద్వారా పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు నేను ఏ ఒక్కరి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top