
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి
గుంటూరు వెస్ట్: మాదక ద్రవ్యాల వినియోగంవల్ల వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా, సామాజిక పరంగా తీవ్ర నష్టాన్ని మిగులుస్తా యని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అధికారులకు ఒకరోజు మాదక ద్రవ్యాల వినియోగం, నష్టాలపై ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలన్నారు. మన పిల్లలు మంచివారైనా చెడు స్నేహాల కారణంగా తప్పుదోవ పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్కసారి వాటికి బానిసలైతే తేరుకోవడం చాలా కష్టమని చెప్పారు. గ్రామస్థాయి నుంచి అధికారులు జిల్లాస్థాయి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. దీన్లో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
– కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి