
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). పక్కన ఎమ్మెల్సీ హనుమంతరావు
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)
మంగళగిరి: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. నగరంలోని మార్కెట్ యార్డు ఆవరణలో సోమవారం ఎమ్మెల్యే ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో చంద్రబాబు లాంటి దిగజారుడు రాజకీయా లు చేసే నాయకుడు మరొకరు లేరని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీ మారాలనుకునే వారు కనీస ఇంగితజ్ఞానం, నైతికత, విలువలు పాటించి వారు పొందిన పదవులకు రాజీనామా చేసి పార్టీ మారడం కనీస రాజకీయ ధర్మం అన్నారు. నాడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో తనతో పాటు తన వెంట వచ్చిన వారితో రాజీనామాలు చేసి మర లా ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారని గుర్తించుకోవాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలలో నైతికత, విలువలు పాటించబట్టే జనం వెంట నడిచారన్నారు. వైఎస్సార్ పార్టీ తరపున గెలిచి పార్టీకి ద్రోహం చేసిన నలుగురు ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేస్తే వారు ఎలాంటి ప్రలోభాలకు గురికాలేదనుకోవచ్చునని, అలా కాకుండా రూ. కోట్లకు అమ్ముడు పోయి ప్రలోభాలకు లొంగిపోయి అర్థం లేని విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు జనాదరణ ఏనాడూ లేదని చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటులు, డబ్బుతోనే నడిచాయని మండిపడ్డారు. చంద్రబాబుతో ఎన్ని పక్షాలు కలిసినా వైఎస్సార్ సీపీని ఓడించడం వారి తరం కాదన్నారు. చంద్రబాబు రాజకీయాలలో ఎంతగా దిగజారుతారనేదానికి నిదర్శనం ఎలాంటి బలం లేని తెలంగాణలో ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ పట్టుబడడమేనన్నారు. మంగళగిరిలో మూడు శాఖల మంత్రిగా ఉన్న కుమారుడు లోకేష్‌ను గెలిపించుకోలేని చంద్రబాబు తాను మరలా గెలిచి సీఎం అవుతాడనుకోవడం భ్రమేనని ప్రజలు సైతం గుర్తించారన్నారు. రాజధానిలో ఇన్‌సైడింగ్ ట్రేడింగ్‌తో కావల్సిన వారికి కావల్సినట్లు వేలాది ఎకరాలు రైతుల భూమిని కట్టబెట్టి కోట్ల రూపాయలు దోచుకున్న చంద్రబాబు ఆ డబ్బుతో ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేయడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు మీద నమ్మ కం లేదు కాబట్టే రాజధానిలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో 2019లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించిందన్నారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబుతో టీడీపీ నాయకులు గుర్తించుకుంటే మంచిదని హితవు పలికారు.