కొండవీడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

- - Sakshi

పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి

యడ్లపాడు: అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకట్టుకునేలా కొండవీడులో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి చెప్పారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ఎస్పీ రవిశంకర్‌, జేసీ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో చారిత్రక కొండవీడు కోట ప్రాంతాన్ని సందర్శించారు. ముందుగా ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుని స్వాగత ద్వారం, పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న డైనింగ్‌ హాల్‌, చెరువులు, ఇతర అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ నుంచి అంతా కలిసి సజ్జమహాల్‌ బురుజు పైకి ట్రెక్కింగ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికం అయ్యేలా పల్నాడు జిల్లాలోని చారిత్రక ప్రదేశం కొండవీడు కోటను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే కొండపైకి విద్యుత్తు సౌకర్యం ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం ఏర్పాటు చేసి విద్యుత్‌ పోల్స్‌, సరఫరా ఇవ్వడం జరిగిందన్నారు. వెదుళ్ల చెరువు ఆహ్లాదకర వాతావారణాన్ని వీక్షించడంతో పాటు, అక్కడే సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా చెరువుపై పది అడుగులు లోపలికి ప్లాంక్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇకపై నైట్‌ క్యాంపులు...

అరకులోయ ప్రాంతంలో మాదిరిగా ఇకపై కొండవీడులోనూ నైట్‌క్యాంపులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 8వ తేదీన ప్రస్తుతం సందర్శించిన అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి కొండవీడులో నైట్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వెదుళ్ల చెరువులో పెడల్‌ బోటింగ్‌ ప్రాజెక్టును త్వరలోనే తీసుకువస్తామన్నారు. అలాగే సజ్జామహాల్‌ నుంచి వెదుళ్ల చెరువు మీదుగా నెమళ్ల బురుజు వరకు రోప్‌ వే ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రానున్న కొద్దిరోజుల్లోనే కొండవీడుకు మరిన్ని పర్యాటక శోభను చేకూర్చనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ప్రస్తుతం కొండవీడుకు అప్రోజ్‌మార్గంలో రావాలంటే పుట్టకోట గ్రామంలో నుంచి రావాల్సి వస్తుందని, అలా కాకుండా గ్రామం వెలుపల ఉన్న మట్టికట్ట పక్కగా 380 మీటర్ల బైపాస్‌ మార్గం పనుల్ని చేపడతామన్నారు. వారి వెంట నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌, కొండవీడు రేంజ్‌ అధికారి రమణమ్మ, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి, కొత్తపాలెం సర్పంచి ఎంవీ సుబ్బారావు, ఇతర శాఖల జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top