
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 532.10 అడుగుల వద్ద ఉంది. ఇది 172.2745 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 6,465, ఎడమకాలువకు 7,768, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరదకాలువకి 320 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 16,553 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 809.50 అడుగుల వద్ద ఉంది. ఇది 34.0048 టీఎంసీలకు సమానం.
ఎన్టీటీపీఎస్‌లో మారిన బయోమెట్రిక్ వేళలు
ఇబ్రహీంపట్నం(మైలవరం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌లో బయోమెట్రిక్ సమయాలను మార్పులు చేస్తూ ఏపీ జెన్‌కో సంస్థ ఎండీ శ్రీధర్ ఈ నెల 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. గతంలో జనరల్ షిఫ్ట్‌లో ఉదయం తొమ్మిది, సాయంత్రం 5.30 గంటలకు బయోమెట్రిక్ వేసేవారు. నూతన విధానంలో ఉదయం, సాయంత్రంతో పాటు మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్, తిరిగి రెండు గంటలకు విధులకు హాజరయ్యేటప్పుడు కూడా బయోమెట్రిక్ వేయాలి. మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు పాత పద్ధతుల్లో విధులకు హాజరయ్యే ముందు, తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. జనరల్ షిఫ్ట్ ఉద్యోగులు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయకుంటే ఆ రోజు హాజరు నమోదుకాదు అనే నిబంధన పెట్టారు.
నేడు దుర్గగుడి పాలక
మండలి సమావేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన పాలక మండలి సమావేశం సోమవారం జరగనుంది. మహా మండపం నాలుగో అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. దుర్గగుడి పాలక మండలి ఫిబ్రవరి ఏడో తేదీన ఏర్పడింది. పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది రెండో సమావేశం. గత నెల 27వ తేదీన జరిగిన తొలి సమావేశంలో భక్తుల సౌలభ్యం కోసం పాలక మండలి కొన్ని ప్రతిపాదనలు చేసింది. దుర్గాఘాట్ నుంచి భక్తులకు ఉచిత బస్సు సర్వీసు, ఉచిత చెప్పుల స్టాండ్, పొంగలి షెడ్డు, హారతి సేవలో పాల్గొన్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించే అంశాలు ఉన్నాయి. వీటిలో ఘాట్‌రోడ్డులో పొంగలి షెడ్డు ఏర్పాటు చేయడం మినహా మిగిలిన ప్రతిపాదనలు ఇంకా ఆచరణలోకి రాలేదు. వీటిలో కొన్నింటికి దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. వాటిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
మరువం.. మురిపెం
దుర్గమ్మకు దవళం, మరువంతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం విశేష పుష్పార్చన జరిగింది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం అమ్మవారికి దవళం, మరువంత, తెల్లజిల్లేడు, మారేడు, తులసీలతో అర్చన నిర్వహించారు. తొలుత విశేష పుష్పార్చనకు వినియోగించే పుష్పాలతో ఆలయ మహిళా సిబ్బంది ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. రాజగోపురం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు చిన్న రాజగోపురం సమీపంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించగా, ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు, భక్తులు, ఉభయదాతలు విశేష పుష్పార్చనను కనులారా వీక్షించారు. అర్చన అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు.
