
ఉగాది పురస్కారాల ప్రదానంలో మల్లాది విష్ణు, వెలంపల్లి, పూనూరు గౌతమ్ రెడ్డి
భవానీపురం(విజయవాడపశ్చిమ):ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమని, ప్రతి రుచికి ఒక అనుభూతి ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆయా రుచుల అనుభూతుల సమ్మేళనమే జీవితమన్నారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మల్లాది వేంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత, సాహిత్య, కళారంగాల్లో లబ్దప్రతిష్టులైనవారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. తొలుత విష్ణు సహస్రనామ పారాయణం, కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు, వేద పండితులతో వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌లు మాట్లాడారు. పద్మశ్రీ అన్నవరపు రామస్వామి, గజల్ శ్రీనివాస్, క్రోవి సార్థసారథి, పద్మశ్రీ దండమూడి సుమతీ రామమోహన్‌రావు, రాణి నరసింహమూర్తి, మల్లాది సూరిబాబు, పాలపర్తి శ్యామలానందప్రసాద్, ఉపద్రష్ట వెంకట రమణమూర్తి, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, డాక్టర్ జి.ఈశ్వర్, వీవీ శివరామకృష్ణ, దామోదర గణపతిరావు, సాయి గీత, రాళ్లపల్లి నవీన్, యడవల్లి రాము, గోనుగుంట్ల యలమందరావు, భాగవతుల వెంటకరామ శర్మలకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌బాబు, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ జమలపూర్ణమ్మ, డెప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, మల్లాది రాజేంద్ర, వేముల హజరత్తయ్య గుప్తా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
వివిధ రంగాల్లోని లబ్దప్రతిష్టులకు
పురస్కారాలు ప్రదానం