
యడ్లపాడు: ముస్లింలకు ముఖ్యమైన..పవిత్రమైన..అతిపెద్ద పండుగ రంజాన్. ఏడాది కాలంగా ఎదురుచూసే రంజాన్ ఉపవాస దీక్షల కాలం వచ్చేసింది. చాంద్రమానం అనుసరించే ఇస్లాం కేలండర్ ప్రకారం 9వ నెలలో రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో శుక్రవారం నుంచి సుదీర్ఘ ఉపవాస దీక్షలను ముస్లింలు చేపడతారు. ఇస్లాం ధర్మాల్ని తు.చ.తప్పకుండా పాటించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశం. ఇది ఆచరించే వారికి ఈ మాసం ఓ శిక్షణ కాలం. ఇస్లాం ధర్మాలు ఒక్క ముస్లింలకు ఉద్దేశించబడినది కాదు సర్వమానవాళికి సంబంధించినది. మనిషి పతనానికి కారణమైన దుర్గుణాలను వీడి ఆధ్యాత్మిక మార్గాన చక్కని క్రమశిక్షణను అలవరుస్తుంది. మనిషిలో మార్పు, మనసులో దయ, ప్రేమ, కరుణ, భక్తిభావాలను పెంపొందిస్తుంది.
30 రోజుల పండుగ...
రంజాన్ ఒక్కరోజు పండుగ కాదు. నెలవంక చూశాకా తిరిగి దర్శించే మధ్యకాలం అంతా ముస్లింలకు పండుగే. అందుకే ఈ మాసంలో నిత్యం ముస్లిం వాడలు, మసీదులు సందడిగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మసీదులకు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక శిక్షణ పొందిన మతగురువులను సైతం తీసుకువచ్చి అందరికీ రంజాన్ ప్రాధాన్యత, ఖురాన్ పఠనం, అల్లాహ్ ప్రపంచ మానవాళికి అందించిన దివ్య సందేశాలను బోధించడం జరుగుతుంది.
సూర్యచంద్రులే ఉపవాసదీక్షలకు ఆధారం..
ముస్లింలకు రంజాన్ మాసంలో రోజా(ఉపావాస) దీక్ష ఆరంభం, విరమణ, పండుగ నిర్వహణ తదితర అన్నింటికీ సూర్యచంద్రులే మార్గదర్శకం. నెలపొడుపు (చంద్రుడి)ని చూసి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. 30 రోజుల అనంతరం తిరిగి నెలవంకను చూసిన మరుసటి రోజు పండుగ పర్వదినాన్ని సంతోషంగా నిర్వహించుకుంటారు. అలాగే సూర్యోదయానికి ముందే సహరీ, సూర్యస్తమయం తర్వాతనే ఇఫ్తార్ ఆహారాన్ని స్వీకరిస్తారు. రోజా సమయంలో ఉదయం 4.10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నోటిలో ఊరే లాలాజలాన్ని సైతం మింగక కఠోర దీక్షను పాటిస్తారు.
దానధర్మాలు, ఇఫ్తార్ విందులు,
సమాజసేవలు..
ఇక రంజాన్‌తో ముడిపడి ఉండే ఇంకో అంశం జకాత్ దాతృత గుణాన్ని పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. తమ సంవత్సర సంపాదనను 2.5శాతం లెక్కగట్టి పేదముస్లింలకు పంచాలని ఖురాన్ చెబుతుంది. జకాత్ చెల్లించడం అనేది ముస్లింల అందరిపై ఉన్న బాధ్యత. పేదవారు కూడా అందరితో సంతోషంగా పండుగ జరుపుకొనేందుకు ఈ దానాలు ఉపయోగ పడతాయి. ఇఫ్తార్‌కి శరీర చలువ కోసం గంజి, శక్తికి స్వీట్లు, పండ్లు, ఫలాలు మసీదుల్లో పంపిణీ చేస్తారు.
రేపటి నుంచి ఉపవాస దీక్షలు ! కళకళలాడుతున్న మసీదులు నిత్యం సత్‌కార్యాలు, ఆధ్యాత్మిక ఆరాధనలు రోజా పాటించేవారికి ప్రభుత్వ విధుల్లో గంట సడలింపు
రోజా అల్లాహ్ ప్రసాదించిన వరం...
రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసి.. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఈ నెల రోజులు మానవుడు ప్రాపంచిక సంతోషాలను త్యజించి, తమలో ఆధ్యాత్మిక శక్తిని నింపుకొనే శిక్షణ కాలమిది. స్వయంగా అజ్ఞానపు చీకట్లను తెంచుకుని, వాస్తవ జ్ఞానవెలుగు మార్గంలోకి మరలడానికి రోజా మానవులకు అల్లాహ్ ప్రసాదించిన వరం. త్రికరణశుద్ధిగా ఉండే ఉపవాస దీక్షతో ఆత్మప్రక్షాళన జరుగుతుంది. దానధర్మాలు, రోజా, నమాజ్, దువా, తరావీహ్‌లతో అనంత కరుణామయుడు అల్లాహ్‌ను ఆరాధించేందుకు, పుణ్యఫలాన్ని పొందేందుకు, స్వర్గలోక వారసులయ్యేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. ఈనెలలో ఒక్క మంచిపని చేస్తే 70 రెట్ల పుణ్యఫలాన్ని దైవం ప్రసాదిస్తారు.
– హాజరత్ పీర్ మహమ్మద్ ముక్తరుల్లాషా, ముస్లిం మతపెద్ద, పసుమర్రు

వ్యాపార దుకాణం వద్ద విద్యుత్ దీపాలతో వెలిసిన చంద్రుడు
