
పంచాంగ శ్రవణం చేస్తున్న శ్రీనివాసరావు, వేదికపై అంబటి మురళీకృష్ణ
● వాగ్దేవి పుత్ర వాగ్భూషణ డాక్టర్ నందనవనం శ్రీనివాసరావు జోస్యం ● బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
కొరిటెపాడు(గుంటూరు): శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొన్నూరు మండలం, మామిళ్లపల్లిలోని శ్రీ పెద్దేటమ్మ తల్లి పీఠం ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాగ్దేవి పుత్ర వాగ్భూషణ డాక్టర్ నందనవనం శ్రీనివాసరావు పంచాంగ శ్రావణం చేశారు. 2024లో ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. రానున్న ఏడాదిలో గ్రహ గమనం, తత్ ఫలితంగా ఆయా రాశుల వారికి సంక్రమించే ఫలితాలను, ఫలాలను తనదైన శైలిలో సామాన్యులకు అర్థం అయ్యేలా వివరించారు. ఈ ప్రభుత్వంలో రాబోయే ఏడాదిలో రాష్ట్ర ప్రజలు మరిన్ని సత్ఫలితాలు పొందుతారని, ఆనందోత్సాహాలతో ఉంటారని జోస్యం చెప్పారు. అనంతరం బజరంగ్ ఫౌండేషన్ సీఈఓ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్క భావోద్వేగానికి తనదైన ప్రత్యేకత ఉందని చెప్పారు. వీటిని సక్రమంగా అర్థం చేసుకుని సంయమనం పాటించినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందనే సందేశం తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ లో నిగూఢమై ఉందని పేర్కొన్నారు. నూతన సంవత్సర తొలిరోజు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవడం జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితులకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. తెలుగువారి సంప్రదాయానికి, సంస్కృతికి కొనసాగింపుగా ఉన్న మన పండుగలను, విశిష్టతను వాటి ప్రాశస్త్యాన్ని భావితరాలకు కూడా తెలియజేసే సదుద్దేశంతో బజరంగ్ ఫౌండేషన్ ఈ ఉగాది వేడుకలను పెద్ద ఎత్తున జరుపుతుందని తెలిపారు. పంచాంగ శ్రవణంలో ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పెద్దేటమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచాంగాలను పంపిణీ చేశారు.