
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి
గుంటూరు వెస్ట్: వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఖాళీల భర్తీ ద్వారా ప్రజలకు విస్తృతంగా సేవలందించే వీలుంటుందన్నారు. జగనన్న కంటి వెలుగు కార్యక్రమం అమలు గ్రామస్థాయి నుంచి పటిష్టంగా ఉండాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రజలకు బీపీ, మధుమేహం, రక్తహీనతలాంటి అనారోగ్య సమస్యలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలలో పరీక్షలు చేయడం, ఇబ్బందులుంటే వారికి పౌష్టికాహారం, మందులు క్రమం తప్పకుండా అందించాలని పేర్కొన్నారు. పీహెచ్‌సీలలో గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 108 సేవలు మరింత మెరుగ్గా ఉండాలన్నారు. కాల్ సెంటర్లలో సిబ్బంది కాలర్స్‌తో మర్యాదగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, సీడీహెచ్‌ఎం డాక్టర్ హనుమంతరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డీపీఎంఓ డాక్టర్ రత్నమన్మోహన్, ఆరోగ్య శ్రీ కో–ఆర్డినేటర్ డాక్టర్ జయరామకృష్ణ, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు