
కొనుగోలుదారులతో కిక్కిరిసిన పండ్ల మార్కెట్
ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణాలకు ఏర్పాట్లు
పాతగుంటూరు: ఉగాది పండుగకు నగరంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. బుధవారం ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆలయాల్లో కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచే స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలిరానుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలు ఆలయాల్లో పురోహితులు పంచాంగ శ్రవణం చేయనున్నారు. ఇందుకు తగినట్లుగా ఆలయ ప్రాంగణాల్లో వేదికలు సిద్ధం చేశారు. ఆలయాలను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు, అరటి బోదెలతో అలంకరించారు. ఇక పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా బస్టాండ్ రైతుబజార్‌లోని పూలమార్కెట్ కిక్కిరిసింది. పంచాంగ పుస్తకాల విక్రయ దుకాణాల వద్ద సందడి నెలకొంది.
● బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాద వితరణ, ఉదయం 8 గంటలకు పంచాంగ శ్రవణం, 10 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు.
● అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
● ఆర్.అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సాయంత్రం ఆరుగంటలకు ఉగాది సేవ నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ శోభకృత్ నామసంవత్సర పంచాంగాలకు పూజ, అనంతరం పంచాంగ శ్రవణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
● సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో సాహితీ వసంతోత్సవం జరుగనున్నది. ఈ ఉత్సవంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.
● అరండల్‌పేట ఏడోలైనులోని అఓపా కార్యాలయంలో సాయంత్రం 5 గంటల నుంచి పంచాంగ శ్రవణం.. అనంతరం ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేస్తారు.