కాపలాదారులకు గ్రీన్‌ సిగ్నల్‌

హెనీ క్రిస్టినాకు అభినందనలు తెలియజేస్తున్న బండి శ్రీనివాసరావు, మోహనరావు, అనురాధ  - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: మనబడి నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన పాఠశాలల్లో రాత్రిళ్లు కాపలాదారులను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదటి దశలో 1,149 పాఠశాలలను రూ.288.58 కోట్లతో ఆధునికీకరించారు. అదేవిధంగా రెండో దశలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మిగిలిన అన్ని పాఠశాలలను అంటే మరొక 2,008 పాఠశాలల్లో అదనపు తరగతి గదులను కలుపుకొని 10 కాంపొనెంట్ల వారీగా రూ.707 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రతి పాఠశాలలో రూ.లక్షలాది విలువైన ఫర్నీచర్‌, ఆర్వో వాటర్‌ ప్లాంటులను ఏర్పాటు చేసిన, చేస్తున్న దృష్ట్యా వాటి భద్రత దిశగా ఆలోచన చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5,388 హైస్కూళ్లలో నైట్‌ వాచ్‌మెన్‌లను నియమించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 400 పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్‌లను నియమించనున్నారు.

హెనీ క్రిస్టినా చేసిన విజ్ఞప్తితో ...

నాడు–నేడు ద్వారా అభివృద్ధి పర్చిన పాఠశాలల్లో కాపలాదారులను నియమించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా గతంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విలువైన సామగ్రి భద్రత దృష్ట్యా కాపలాదారులు ఎంతో అవసరమని ఆమె సీఎం వైఎస్‌ జగన్‌కు చేసిన విజ్ఞప్తి కార్యరూపం దాల్చింది. నాడు–నేడు మొదటి, రెండో దశలో పనులు పూర్తయిన, జరుగుతున్న ఉన్నత పాఠశాలలకు నెలకు రూ.ఆరు వేల వేతనంతో కాపలాదారులను నియ మించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ సోమవారం జీఓ ఎం.ఎస్‌ 30 విడుదల చేశారు. ఇందులో కత్తెర హెనీ క్రిస్టినా 2022 ఏప్రిల్‌ 20, అక్టోబర్‌ 31న సీఎం వైఎస్‌ జగన్‌కు చేసిన విజ్ఞప్తులను ప్రస్తావించారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఆయా భర్త, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధంగా సాధ్యం కాకపోతే స్థానికంగా ఉన్న వ్యక్తిని నియమించాల్సి ఉంది.

వాచ్‌మెన్ల నియామకంపై హర్షం

రాష్ట్ర వ్యాప్తంగా 5,388 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రాత్రి కాపలాదారులను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశా రు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినాను కలిసిన బండి శ్రీనివాసరావు, సంఘ నాయకులు కాపలాదారుల నియామకానికి కృషి చేసినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.

నాడు–నేడు ద్వారా పాఠశాలలను

రూ.కోట్లతో ఆధునికీకరించిన

ప్రభుత్వం

చరిత్రలో తొలిసారిగా

కాపలాదారులను నియమిస్తూ

ఉత్తర్వులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో

400కు పైగా హైస్కూళ్లలో విలువైన

సామగ్రికి భద్రత

సీఎం వైఎస్‌ జగన్‌కు జెడ్పీ చైర్‌పర్సన్‌

హెనీ క్రిస్టినా చేసిన విజ్ఞప్తితో

రాష్ట్రవ్యాప్తంగా అమలు

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top