ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్
పాతగుంటూరు: గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు కోరారు. మంగళవారం బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం వల్ల గుంటూరు, బాపట్ల జిల్లాలలో 5 మండలాల్లో ఉన్న 80 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు వసతి ఏర్ప డుతుందన్నారు. వర్షాధారంపై ఆధారపడ్డ ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత 50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు ఐక్యంగా గుంటూరు చానల్ పొడిగింపునకు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ 52 గ్రామాల్లో 80 వేల ఎకరాలు సాగునీటిని, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయ పార్టీలు ఈ సమస్యపై ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు.