
● గత డీఎంహెచ్‌ఓను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్ ● తాజాగా మరికొంత మంది సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ పనితీరుపై పలు ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి కార్యాలయ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పందన కార్యక్రమానికి పలుమార్లు గైర్హాజరవడం, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సక్రమంగా నివేదికలు అందించకపోవడం, గత డీఎంహెచ్‌ఓపై అనేక ఆరోపణలు రావడంతో తక్షణమే ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో దృష్టి సారించి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు వైఎస్సార్ అర్బన్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నారు. శాఖలో అన్ని పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్య ఆరోగ్య శాఖకు చెడ్డపేరు వస్తుండటంపై జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పలు నిధులకు సంబంధించిన ఫైల్స్, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫైల్స్ మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. కార్యాలయ ఉద్యోగులు సైతం వాటిని సకాలంలో వెతికి కలెక్టర్ కార్యాలయానికి పంపించలేదు. అంతేకాకుండా పలు ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ బిల్స్ ప్రభుత్వం విడుదల చేసి ఏడాది కావస్తున్నా వాటిని కార్యాలయ ఉద్యోగులు, అధికారులు కోవిడ్ కాలంలో పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బంది ఖాతాల్లో జమ చేయలేదు. దీనిపై పలు మార్లు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలకు కలెక్టర్ రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా కోవిడ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులను సరెండర్ చేసేందుకు కలెక్టర్ రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు సంబంధిత ఫైళ్లను కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. కార్యాలయం పరిపాలన అధికారి, ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్‌లపై చర్యలకు రంగం సిద్ధమైంది.