జిల్లాలో 1424 హెక్టార్లలో పంటనష్టం

ఉపరితల ద్రోణితో జిల్లావ్యాప్తంగా వర్షాలు ఆందోళనలో రైతులు

కొరిటెపాడు(గుంటూరు): ఉపరితల ద్రోణితో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో 1220 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 204 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో మంగళగిరి మండలంలోని నూతక్కి, రామచంద్రాపురం, మంగళగిరి గ్రామాలలో 500 హెక్టార్లలో మొక్కజొన్న, తాడేపల్లిలో 110 హెక్టార్లలో మొక్క జొన్న, దుగ్గిరాలలో 500 హెక్టార్లలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. దుగ్గిరాలలో మరో 100 హెక్టార్లలో జొన్నపంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే మంగళగిరి మండలంలోని నూతక్కి, రామచంద్రాపురం, పెదవడ్లపూడి గ్రామాలు, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, ఇప్పటం, గుండెమెడ గ్రామాల్లో 196 హెక్టార్లలో అరటి పంట, మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామంలో 8 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం జరిగిట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పారదర్శకంగా పంట నష్టం నమోదు...

పంట నష్టం నమోదు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు సూచించారు. ఏఓలు, వీఏఏలతో సోమవారం ఆయన ఎన్యుమరేషన్‌పై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలవాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పొలాల్లోకి వెళ్లి పంట నష్టం వివరాలు నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వారి పరిధి లోని అన్ని గ్రామాలలో పర్యటించాలని సూచించా రు. ఈ నెల 30వ తేదీ లోపు పారదర్శకంగా ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 3వ తేదీ వరకు పంట నష్టం జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా గ్రామాల్లో దండోరా వేయించిన తర్వాతనే జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శించాలని సూచించారు. పంట నష్టం నమోదులో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తుది జాబితాను ఏప్రిల్‌ 4వ తేదీన జిల్లా కలెక్టర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని ఆయన వివరించారు.

ప్రత్తిపాడులో 14.2 మి.మీ వర్షం

జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 14.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. మార్చి మాసంలో సాధారణ వర్షపాతం 6.4 మి.మీ కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 32.9 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కాకుమాను మండలంలో 10 మి.మీ., వట్టిచెరుకూరు 8.6, తెనాలి 2.8, పొన్నూరు మండలంలో 2.4 మి.మీ చొప్పున వర్షం పడింది.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top