
జ్యోతి ప్రజ్వలం చేస్తున్న త్రిదండి చిన్న జీయర్‌స్వామి
తాడేపల్లిరూరల్: మానవ సేవే సర్వప్రాణుల సేవ అని త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి అన్నారు. సోమవారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మన భూమి మన బాధ్యత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన రాకను పురస్కరించుకుని కేఎల్ ఈఎఫ్ చైర్మన్ కోనేరు సత్యనారాయణ, కార్యదర్శి కోనేరు శివ కాంచనలత ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా జీయర్ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పక్షులు, జంతువులు చెట్లను నరకడం లేదు కానీ మానవుడే చెట్లను నరికి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడన్నారు. భూమి తల్లి మనకు ఎంతో జీవాన్ని, వనరులను ప్రసాదిస్తే మనం స్వార్థంతో వనరులను కలుషితం చేసి మానవ మనుగడను ప్రమాదంలో పడవేస్తున్నామని హెచ్చరించారు. ప్రపంచంలో 300 సంవత్సరాల క్రితమే టెక్నాలజీ ఉందని, కానీ అప్పుడు జరగని ప్రకృతి విధ్వంసం గత కొద్ది సంవత్సరాల్లోనే జరిగిందన్నారు. ప్రకృతికి మనం మేలు చేస్తే మనకు మనం మేలు చేసుకున్నట్లే అని హితవు పలికారు. మీరు పరబ్రహ్మను, ఆత్మను చూశారా? అని ఒక విద్యార్థి ప్రశ్నించగా, సమాధానంగా ప్రకృతి రూపంలో నేను పరబ్రహ్మను చూస్తున్నానని సమాధానమిచ్చారు. విశ్వవిద్యాలయ చైర్మన్ కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ వికాస్ తరంగిణి అనేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సామాజిక బాధ్యతను నేర్పుతోందన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ఆచార్య కేవీఎస్ మురళీకృష్ణ, విశ్వవిద్యాలయ ప్రొ చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ప్రొ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.జగదీష్, వివిధ విభాగాల డీన్‌లు, అధిపతులు పాల్గొన్నారు.
కేఎల్‌యూలో మన భూమి మన బాధ్యత కార్యక్రమం
ముఖ్యఅతిథిగా విచ్చేసిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి