
సమస్యను వింటున్న జిల్లా ఏఎస్పీ సుప్రజ, పక్కన దక్షిణ డీఎస్పీ జెస్సీప్రశాంతి
నగరంపాలెం(గుంటూరు): స్పందనకు వచ్చే ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని ఏఎస్పీ (పరిపాలన) కె.సుప్రజ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవా రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్) జరిగింది. జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ (పరిపాలన) కె.సుప్రజ బాధితుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. పలువురు ఆర్జీదారుల సమస్యలను అలకించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో జూమ్ ద్వారా ఏఎస్పీ మాట్లాడారు. బాధితుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పందనకు వచ్చే ప్రతి ఆర్జీని కూలంకుషంగా విచారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ డీఎస్పీ జెస్సీప్రశాంతి కూడా ఆర్జీలు స్వీకరించారు.
చూపు పోయింది
కంటి శస్త్రచికిత్స కోసం 2021 ఆగస్టులో తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాను. 29న శస్త్రచికిత్స చేసి 30న డిశ్చార్జ్ చేశారు. అయితే కంటి చూపు కనిపించకపోవడంతో జీజీహెచ్‌లో చూయించుకున్నాను. అక్కడ వైద్యులు పరీక్షించి, చూపుపోయిందని బదులిచ్చారు. దీంతో శస్త్రచికిత్స చేసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులను సంప్రదించాను. నిర్వాహకులు నా పట్ల ఇష్టానుసారంగా మాట్లాడారు. కంటి చూపు పోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
– ఎం.నాగేశ్వరరావు, పాతరెడ్డిపాలెం, చేబ్రోలు
సంతకం ఫోర్జరీ
నా మేనకోడలుకు 2020లో అచ్చంపేట మండలం తాళ్లచెరువు వాసితో పెళ్లయింది. వివాహ ధ్రువీకరణ పత్రంలో నేను రెండో సాక్షిగా సంతకం చేశాను. అయితే సదరు వ్యక్తి సత్తెనపల్లిలో పనిచేసే ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను ఇంటి నుంచి పంపేశాడు. అనంతరం గుంటూరు కోర్టులో కేసు దాఖలు చేసి, భార్యకు కోర్టు నుంచి విడాకుల నోటీసు పంపించాడు. కోర్టు కాగితాలను నిశితంగా పరిశీలించగా, వివాహ సమయంలో సాక్షిగా చేసిన నా సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించాను. తప్పుడు సంతకంతో విడాకులు పొందేందుకు ప్రయత్నించిన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. – ఎం.ఏడుకొండలు, గుంటూరు టౌన్
బ్యాంక్‌లో ఉద్యోగమని..
ఉద్యోగం నిమిత్తం ఓ కన్సల్టెన్సీని సంప్రదించా. బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.50 వేలు తీసుకున్నారు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో డబ్బులు చెల్లించాలని పలుమార్లు అడిగినా సరైన సమాధానంలేదు. అదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. న్యాయం చేయండి.
– మీరాబీ, నల్లపాడు
చర్యలు చేపట్టాలి
గత రెండేళ్లుగా యూట్యూబ్‌లో సామాజిక అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నాను. ఈ క్రమంలో ఓ వ్యక్తి నా పట్ల దుర్భాషలాడుతున్నాడు. దీంతో అతనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతనిపై కేసు నమోదైంది. అయినప్పటికి అతని ప్రవర్తనలో మార్పురావడంలేదు. అతనితో పాటు సహకరిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
– ఓ మహిళ, అరండల్‌పేట
●
ఏఎస్పీ (పరిపాలన) కె.సుప్రజ