
నేలవాలిన అరటి చెట్లు
తాడేపల్లిరూరల్: మంగళగిరి నియోజకవర్గవ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. దుగ్గిరాల మండల పరిధిలో వరి కోతల అనంతరం రైతులు మొక్కజొన్న వేశారు. ఇప్పుడిప్పుడే మొక్కజొన్న కండెలు వస్తున్నాయి. పంట మరో నెల రోజుల్లో చేతికి వస్తుందనగా గాలివాన బీభత్సం సృష్టించడంతో మొక్కజొన్న తోటలు నేలవాలాయి. శృంగారపురం, పెదపాలెం, చినపాలెం, కంఠంరాజు కొండూరు, పెరికలపూడి, గొడవర్రు తదితర ప్రాంతాల్లో ఎకరంలో 20 నుంచి 30 శాతం వరకు మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలియజేశారు. దుగ్గిరాల మండల పరిధిలోని తుమ్మపూడి, కంఠంరాజు కొండూరు తదితర ప్రాంతాల్లో ఉన్న సపోటా, నిమ్మ తోటల్లో ఈదురుగాలులకు కాయలు రాలిపోయాయి. మంగళగిరి రూరల్ పరిధిలోను, తాడేపల్లి రూరల్ పరిధిలో అక్కడక్కడ పసుపు వండి ఆరబోసిన వాటిలో వర్షపు నీరు చేరింది. తాడేపల్లి మంగళగిరి రూరల్ పరిధిలోనూ, నూతక్కి, రేవేంద్రపాడు, పెదవడ్లపూడి, చినవడ్లపూడి, మెల్లెంపూడి, గుండిమెడ, చిర్రావూరు, ప్రాతూరు, కుంచపల్లి, ఉండవల్లి, పెనుమాక తదితర ప్రాంతాల్లో ఎకరం అరటి తోటలో 70 నుంచి 150 చెట్ల వరకు విరిగిపోయాయని, మరో 10–15 రోజుల్లో గెల కాపునకు వస్తుందనగా ఈవిధంగా జరిగిందని రైతులు వాపోయారు. కూరగాయల తోటలు, పూల తోటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు తెలియజేశారు. గత మూడు రోజుల నుంచి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నప్పటికీ రైతులకు ఎటువంటి నష్టం కలగలేదని, రాత్రి వీచిన గాలుల వల్ల అపార నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు.

దుగ్గిరాలలో పడిపోయిన మొక్కజొన్న