పేద విద్యార్థులకు జగనన్న దీవెన

- - Sakshi

● తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన పథకం నిధులు ● జిల్లాలో 37,228 మంది విద్యార్థులకు రూ.32.08 కోట్లు విడుదల ● గుంటూరు నుంచి సీఎం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌

గుంటూరు వెస్ట్‌: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు, బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన జగనన్న విద్యాదీవెన పథకం కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ – డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి సంబంధించి ముఖ్యమంత్రి విద్యాదీవెన నిధులు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారన్నారు. జిల్లాలో 37,228 మంది విద్యార్థులకు సంబంధించి 33,226 తల్లుల ఖాతాల్లోకి రూ.32.08కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పథకం 2019లో ప్రారంభమైందని కేవలం గుంటూరు జిల్లాకే రూ.562కోట్లు విద్యార్థుల కోసం అందజేశారన్నారు. ప్రభుత్వం అందించే ఈ చేయూతను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ పేదరికాన్ని కేవలం విద్య ద్వారా జయించవచ్చని నమ్మి ముఖ్యమంత్రి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. పేదరికాన్ని విద్యతో జయించే క్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. ఒక్క తరం చదువుకుంటే తరతరాలు బాగుపడతాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు నమూనా చెక్కును కలెక్టర్‌, జెడ్సీ చైర్‌పర్సన్‌ క్రిస్టినా, గుంటూరు డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, కుమ్మరి శాలివాహన చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ముంతాజ్‌ పఠాన్‌, కొత్తా చినప్పరెడ్డి, గనిక ఝాన్సీరాణి, కోలా భవాని, బత్తుల దేవానంద్‌, పఠాన్‌ జమీరా బేగం, షేక్‌ అబీదా బేగం, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మధుసూదనరావు, డీఆర్‌ఓ చంద్రశేఖర్‌ నమూనా చెక్కును అందజేశారు.

విద్య అనే బ్రహ్మాస్త్రాన్ని అందిస్తున్నారు

ఆడబిడ్డలను తోబుట్టువులుగా చూసే సీఎం జగనన్న నా లాంటి పేద యువతకు విద్య అనే బ్రహ్మాస్త్రాన్ని ఇస్తున్నారు. ఆయన రుణం తప్పక తీర్చుకుంటాం. ప్రతి సెమిస్టర్‌కు క్రమం తప్పకుండా నగదు అందజేస్తున్నారు. మా ఇంట్లో కూడా అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

– సునీత, పారా మెడికల్‌ కోర్సు విద్యార్థిని

ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేను..

ప్రస్తుతం విద్య ఖరీదైన అంశం. మాలాంటి పేద విద్యార్థులకు పెద్ద చదువులు ఊహకు అందని పరిస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌ సహృదయంతో జగనన్న విద్య కానుక, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా మాకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేను.

– సుజాత, డిగ్రీ మూడో సంవత్సరం, ప్రభుత్వ మహిళా కళాశాల

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top