
గుంటూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో పాఠశాలలను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే నాడు–నేడు మొదటి దశ పనులు దిగ్విజయంగా పూర్తవగా, రెండో దశలో మిగిలిన నిర్మాణాలు, ఆధునికీకరణ పనులను వేగవంతంగా పూర్తిచేస్తోంది. దీంతో ప్రభుత్వ బడులు వచ్చే విద్యాసంవత్సరం నాటికి కొత్తరూపు సంతరించుకుని, విద్యార్థులకు ఆహ్వానం పలకనున్నాయి.
నాడు–నేడు రెండోదశ పనులు వేగవంతం
● గుంటూరు జిల్లాలో 419 పాఠశాలలకు రూ.11.98 కోట్లు విడుదల ● వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేసే లక్ష్యంతో పనుల్లో పురోగతి ● అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు పాఠశాలలకు చేరుతున్న నూతన ఫర్నిచర్ ● పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్న ఆధునికీకరణ పనులు ● రెండో దశలో రూ.163 కోట్ల అంచనాల్లో ఇప్పటివరకు రూ.43.43 కోట్లు విడుదల
కొత్త ఫర్నిచర్ చూడటం ఇదే ప్రథమం..
మైనార్టీ విద్యార్థుల కోసం నడుస్తున్న మా పాఠశాలను నాడు–నేడు రెండో దశలో ఎంపిక చేశారు. పాఠశాల చరిత్రలో కొత్తగా ఫర్నిచర్ రావడం ఇదే మొదటిసారి. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా 30 డ్యుయల్ డెస్క్‌లను పంపించారు. ఇంత కాలం నేలపై కూర్చున్న విద్యార్థులు డ్యుయల్ డెస్క్‌ల రాకతో ఎంతో సంతోషిస్తున్నారు.
– రాబియా బస్రీ, ఉపాధ్యాయురాలు, ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాల, చౌత్రా, గుంటూరు
గుంటూరు ఎడ్యుకేషన్: మన బడి నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చివేస్తూ ప్రారంభించిన విద్యాయజ్ఞాన్ని ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తోంది. నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,149 పాఠశాలలకు మహర్దశ కల్పించిన ప్రభుత్వం రెండో విడతలో మిగిలిన పాఠశాలలన్నింటినీ ఆధునికీకరణ బాట పట్టించేందుకు వేసిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాల విభజన అనంతరం ఒక్క గుంటూరు జిల్లాలోనే నాడు–నేడు రెండో విడతలో 563 పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం రూ.200 కోట్లతో ఆధునికీకరణ పనులను చేపట్టింది. పాఠశాల భౌతిక స్వరూపాన్ని మార్చి వేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో కూడిన 10 కాంపొనెంట్స్ వారీగా ఆధునికీకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అవసరమైన విధంగా అదనపు తరగతి గదులను సైతం నిర్మి స్తున్నారు. రెండో విడతలో వేగంగా పనులు జరుగుతున్న 419 పాఠశాలలకు తాజాగా ప్రభుత్వం రూ.11.98 కోట్లు విడుదల చేసింది. సంబంధిత పాఠశాలల ఆధునికీకరణకు అనుమతులు మంజూరు చేసిన రూ.163.85 కోట్లలో ఇప్పటి వరకు రూ.43.43 కోట్లు విడుదల చేసింది. పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగానే పనులన్నింటినీ పూర్తి చేసేవిధంగా విద్యాశాఖాధికారులకు లక్ష్యాన్ని విధించింది.
పాఠశాలలకు నూతన ఫర్నిచర్ రాక..
నాడు–నేడు రెండో విడతలో ఎంపికై న పాఠశాలలకు కొత్తగా కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ప్రభుత్వం నేరుగా ఆయా పాఠశాలలకు పంపుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు డ్యుయల్ డెస్క్‌లు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు అవపరమైన కుర్చీలు లారీల ద్వారా నేరుగా పాఠశాలలకు పంపుతున్నారు. కొత్త ఫర్నిచర్ రాకతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఎటువంటి మౌలిక వసతులు, ఫర్నిచర్‌ను చూడని పరిస్థితిల్లో ప్రస్తుతం రూ.లక్షల వ్యయంతో బ్రాండెడ్ ఫర్నిచర్‌ను పంపుతుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఆధుని కీకరణ పనులతో ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ముస్తాబవుతున్నాయి.

