
గుంటూరులో ‘పది’ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థినులు
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేని విధంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అధికారులు టెన్త్ పరీక్ష కేంద్రాలను హై సెక్యూరిటీ జోన్లుగా మార్చివేశారు.
మాల్ ప్రాక్టీసులకు తావులేని విధంగా ..
ఏడాది పొడవునా ఎంతో శ్రమించి, పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతో హాజరయ్యే సమయంలో ఎక్కడో ఒక చోట ప్రశ్నపత్రం లీకేజ్ అయ్యిందంటూ వచ్చే వదంతులతో విద్యార్థులు ఎంతో ఆందోళనకు గురి కావడం జరుగుతోంది. అయితే గతేడాది చోటు చేసుకున్న పేపర్ లీకేజీ సంఘటనల దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం పరీక్ష కేంద్రాల్లోకి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మినహా, ఇతర ఎటువంటి సామగ్రిని తీసుకెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు పరీక్షల నిర్వహణలో కఠినంగా వ్యవహరించనుంది.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకే
బాధ్యతలు..
టెన్త్ పరీక్షల విధి నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు, ఇన్విజిలేటర్లతో పాటు రూట్ అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులనే నియమిస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించిన ప్రభుత్వం డీఓలు, ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు వద్ద సైతం సెల్‌ఫోన్లు ఉండేందుకు అనుమతించలేదు. పరీక్ష విధులకు వచ్చే సమయంలో ఇన్విజిలేటర్లు తమ వెంట సెల్‌ఫోన్లు తీసుకురావద్దని, ఒక వేళ తెచ్చినా వాటిని భద్రపర్చేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు లేవని విద్యాశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా, విద్యార్థులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 69,412 మంది విద్యార్థులు..
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు మూడు జిల్లాల పరిధిలో 368 కేంద్రాల పరిధిలో 69,412 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గుంటూరు జిల్లాలో 27,714 మందికి 138, పల్నాడులో 24,354 మందికి 127, బాపట్ల జిల్లాలో 17,344 మంది విద్యార్థులకు 103 కేంద్రాల చొప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్న పత్రంపై ఏడు అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్ ముద్రిస్తారు. తద్వారా ఏదైనా సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయితే, అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని విద్యాశాఖ అమల్లోకి తెచ్చింది. విద్యార్థులకు వారి రోల్ నంబరు ఆధారంగా సీటింగ్ అరేంజ్‌మెంట్లతో పాటు ఓఎంఆర్ షీట్, ప్రశ్న పత్రాలను విద్యార్థులకు సీరియల్ నెంబర్ వారీగా పంపిణీ చేయనున్నారు.
ప్రతి విద్యార్థికి 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇవ్వనున్నారు. అదనంగా పేపర్లు అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు. కాగా విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బుక్‌లెట్‌లలో ఏ ఒక్క పేజీని చింపినా మాల్ ప్రాక్టీసుగా పరిగణించే విధంగా కఠినమైన నిబంధనలు అమలు పరచనున్నారు.