విశ్లేషణ
నాలుగు రాష్ట్రాలు (కేరళం, తమిళ నాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన వేసవి ఎన్నికల్లో తమిళ శాసనసభ ఫలితాలు చాలావరకు అనూహ్యంగా వచ్చాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధారణ మెజారిటీకి సమీపంలోకి రావడం నిజంగా రాజకీయ పండితుల అంచనాలకు అందని విషయం. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పదిహేనేళ్లుగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్‌ను కేంద్రంలో పాలకపక్షం బీజేపీ ఓడించి 200కు పైగా సీట్లు సాధించి తొలిసారి అధికారంలోకి రావడం కూడా అత్యధిక ఎన్నికల విశ్లేషకుల లెక్కలకు చిక్కని వాస్తవం.
1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే)లు ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత జీవించి ఉండగా జరిగిన 2016 ఎన్నికల్లో మాత్రం ఈ సాంప్రదాయం మారింది. 2011 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆమె పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఊహించని సంచలనానికి దారితీశాయి. ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం లేని మూడో పెద్ద రాజకీయ పక్షం టీవీకే 107 సీట్లు గెలుచుకుని తమిళ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. పార్టీ నిర్మాణం, తెలివైన రాజకీయ వ్యూహం, రాజకీయ అనుభవం లేకుండానే విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించడం తమిళ ప్రజల కొత్త ఆలోచనా ధోరణికి అద్దం పడు తోంది. జనాకర్షక పథకాలు, ప్రజలు ఉపయోగించే అనేక వస్తువు లను ఉచితంగా ఇవ్వడం, ఇంకా చాలా సౌకర్యాలు, పథకాల పేరిట సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీలు గుప్పించే తమిళ ఎన్నికల్లో ఇలాంటివి ఏవీ లేకుండా టీవీకే విజయం సాధించడం అంత తేలికగా బయటివారికి అర్థంకాని అంశమే.
ద్రవిడ సిద్ధాంత పునాది లేకుండా గెలుపెలా?
తమిళనాడులో (పాత పేరు మద్రాస్) 1952 ముందు నుంచీ సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికాయి 1967 శాసనసభ ఎన్నికలు. దశాబ్దాలుగా తమిళ నేలలో ప్రజలను ఆకట్టుకుని వేళ్లూ నిన ద్రవిడ సిద్ధాంతం పునాదిగా (బ్రాహ్మణేత వర్గాల సంక్షేమం, తమిళ భాషకు గౌరవం) ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఈ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ప్రాంతీయపక్షంగా రికార్డు నమోదు చేసుకుంది. సీఎం అణ్ణాదురై నాయకత్వంలో ఎం.కరుణానిధి వంటి పలువురు హేమాహేమీలైన నేతల ఉమ్మడి కృషితో నాడు డీఎంకే విజయం కాంగ్రెస్‌పై సాధ్యమైంది. అలాగే, డీఎంకే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సినీ నటుల జనాకర్షక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ పార్టీ అన్నాడీఎంకే విజయానికి ఆయన ఆకర్షణేగాక, ద్రవిడ సిద్ధాంత బలం ఉన్న డీఎంకేతో ఆయన దశా బ్దాల అనుబంధం కూడా ఉపయోగపడింది. అయితే, విజయ్ పార్టీ టీవీకేకు ఎంజీఆర్ పార్టీకి ఉన్న నేపథ్యం లేదు. యువతలో విపరీ తమైన ‘క్రేజ్’ ఆయనకు ఉందిగానీ ఎంజీఆర్‌లా విస్తృత రాజకీయ అనుభవం లేదు.
సిద్ధాంతాలు అసలు లేకపోలేదు...
2024 అక్టోబర్‌లో విక్రవండిలో జరిగిన టీవీకే తొలి రాజకీయ మహాసభలో ‘‘బీజేపీ మితవాద పోకడల కారణంగా ఇది టీవీకేకు ‘సైద్ధాంతిక ప్రత్యర్ధి’; డీఎంకే అనుసరించే అవినీతి, వారసత్వ రాజకీయాల వల్ల అది మాకు ‘రాజకీయ శత్రువు’ అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ లెక్కన మతతత్వ వ్యతిరేక ధోరణి, లౌకిక విశ్వాసాల కారణంగా బీజేపీని తన రాజకీయ శత్రువుగా ప్రకటించడం టీవీకే మౌలిక సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వడమే అవుతుంది. అందుకే, ఫలితాలు ప్రకటించిన రోజున డీఎంకే నేతృత్వంలోని తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కాంగ్రెస్‌తో కొత్తగా కూటమి కట్టడానికి విజయ్ పార్టీ సిద్ధమని ప్రకటించింది. పూర్వ పాలకపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే బదులు కేవలం ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్‌తో దోస్తీ తన పార్టీకి క్షేమమేగాక, సైద్ధాంతిక అనుకూల అంశమని విజయ్ గుర్తించినట్టు కనిపిస్తోంది.
అత్యధిక సర్వేలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా టీవీకే గెలుపునకు కారణాలు ఏమిటనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1977లో ఎంజీఆర్ మొదటిసారి సీఎం అయి నప్పటి నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజకీయ పెత్తనం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఈ రెండు పార్టీల వ్యవస్థ తమిళులకు విసుగు పుట్టించినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్, సొంత పార్టీ పెట్టి బోల్తాపడిన మరో స్టార్ హీరో కమల్‌హాసన్ అనుభవాలు గమ నించిన తమిళ ప్రజానీకం కొత్త తరం హీరో 51 ఏళ్ల విజయ్ పార్టీ టీవీకేను ఈసారి ఆదరించాలని నిర్ణయించుకున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న యువత, దళితులు పార్టీ పెట్టినప్పటి నుంచీ విజయ్‌కు అనుకూలంగా మారారు. యువతరంలో విజయ్‌పై ఉన్న మోజు గట్టి పునాదులు లేని ఆయన పార్టీకి ఏకంగా దాదాపు 110 సీట్లు వచ్చేలా చూడటం రాజకీయ విప్లవం కింద పరిగణించాలి.
టీవీకే పుట్టినప్పటి నుంచీ దానికి జనంలో పెరిగిన ఆదరణ చూసిన కాంగ్రెస్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు దానితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఒంటరి పోరుకే సిద్ధం కావడంతో ‘దళపతి’తో ఎన్నికల స్నేహానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు కొద్దిలో మెజారిటీ మార్క్ (మొత్తం 234 సీట్లకుగాను 118) దక్కకపోవడం, ‘సెక్యులరిజం’ అనే సిద్ధాంతం టీవీకేతో చేతులు కలిపే అవకాశం కాంగ్రెస్‌కు లభించింది. తమిళ ఓటర్లు టీవీకేను ఆదరించడం ద్వారా రెండు పాత ద్రవిడ పార్టీలు మాత్రమే పాలక పక్షాలుగా దిక్కయిన పరిస్థితి నుంచి బయట పడ్డారు.
విజయ్ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం (తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ పుట్టుకతో క్రిస్టియన్, తల్లి హిందువు) టీవీకేకు అనుకూల లేదా ప్రతికూల అంశం కాలేదు. రాష్టంలో కులం ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తన కులం తమిళ్ అని ప్రకటించుకోవడం తమిళ జనానికి బాగా నచ్చినట్టుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం పుట్టిన విజయ్ పార్టీకి దాని కొత్తదనం, నాయకుడికి రాజకీయ నేపథ్యం లేకపోవడం సానుకూల అంశా లుగా మారాయి. దాదాపు 8 లక్షల మంది అభిమానులతో టీవీకే మొదటి రాజకీయ మహాసభ జరిగిందంటే జనంలో విజయ్‌పై ఉన్న తీవ్ర అభిమానం, మోజు మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు అర్థం కాలేదని అనుకోవాలి. నేటి తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు ఉన్న పరిమితులను చెబుతున్నాయి. ఏమైనా విజయ్‌కు తమిళనాడు ‘దళపతి’ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా తమిళ సోదరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
స్వాతంత్య్ర పోరాటం నుంచి సామాజిక విప్లవాల వరకూ ఆధునిక భారతంలో ముందుండి నడిచిన బెంగాలీలు, తమిళులు ఎట్టకేలకు తమ పాలకపక్షాలను, పాలకులను మార్చేలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు.
కమ్యూనిస్టులకు 34, తృణమూల్‌కు 15 ఏళ్లు అవకాశం!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అధికారం వస్తుందని ఎక్కువ సర్వేలు సూచించలేదు. 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారి గద్దెనెక్కే అవకాశం దక్కించుకోవడం కూడా అత్యధిక మీడియా, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని వాస్తవం. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెల్చుకున్న బీజేపీ 2021లో తన బలాన్ని వంగ శాసనసభలో 77 స్థానాలు పెంచుకోవడం కొత్త రికార్డు. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి మెజారిటీ సీట్లు (294 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 అవసరం) వస్తాయని కొందరు ఎన్నికల పండితులు వేసిన అంచనాలు నిజం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన పార్టీని విజయపథంలో నడిపించారు. బెంగాల్ బెబ్బులిగా పొగడ్తలు అందుకున్నారు. 
గత 15 ఏళ్లుగా అవాంఛనీయ పోకడలనే తృణమూల్ అప్రకటిత పాలనా విధానంగా ఎంచుకోవడం ‘దీదీ’ పతనానికి దారితీసింది. సీపీఎం, సీపీఐ నాయకత్వంలోని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన (లెఫ్ట్ ఫ్రంట్) సర్కారు 34 సంవత్సరాల పాలనలో బెంగాల్ ప్రజల జీవితాలను పాలక కూటమికి విధే యులైన అసాంఘిక శక్తులే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం తెలిసిన విషయమే. ‘పార్టీ సొసైటీ’గా పిలిచే అవాంఛనీయ ధోర ణిని దశాబ్దపున్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అను సరించింది. అంతేగాక, బెంగాల్‌లో 30 శాతం వరకూ ఉన్న మైనారిటీలకు మమత పెద్ద పీట వేస్తున్నారనీ, మెజారిటీ మతస్తుల బాగోగులు ఆమెకు పట్ట వనే ప్రచారం బూటకం కాదు, నిజమనీ అత్యధిక బెంగాలీలు నమ్మారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని రేప్, హత్య వంటి కొన్ని ఘటనలు మహిళా సీఎం పాలనలో స్త్రీలకు అసలు రక్షణ లేదనే బీజేపీ ప్రచారానికి బలం ఇచ్చాయి.
‘మార్క్సిస్టుల అరాచక పాలనకు స్వస్తి పలికి సుపరిపాలన అందిస్తాన’ని సీఎం పీఠమెక్కిన మమత ఏలుబడిలో పాలన బాగా దిగజారడం, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవడానికి దోహదం చేశాయి. 2000 నవంబర్ నుంచి 2026 మే వరకూ పాతిక సంవ త్సరాలకు పైగా ఇద్దరే ఇద్దరు సీఎంలు మార్క్సిస్టు బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీలను చూసిన బెంగాలీ జనం పలు కారణాల వల్ల కొత్త ముఖం కావాలని కోరుకున్నారు. వారి ఈ ఆకాంక్ష సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని మెజారిటీ ఈ ఎన్నికల్లో సాధించడానికి ఒక ప్రధాన కారణమైంది.
నాంచారయ్య మెరుగుమాల
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్


