ఆ ఒప్పందం సఫలం కావాలంటే...

Sakshi Guest Column On Covid Vaccination

ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపంచంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్‌ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువే. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలకు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకువస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంతవరకూ మహమ్మారిపై ఒప్పందం కూడా అంతర్జాతీయ వాతావరణ మార్పు ఒడంబడికలాగే నిష్ఫలమవుతుంది. 

కోవిడ్‌–19 మహమ్మారి భారత్‌లో తగ్గు ముఖం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2022 మార్చి 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల 80 లక్షల కేసులు నమోదు కాగా, 60 లక్షల మంది మరణాల బారిన పడ్డారని సమాచారం. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ఆఫ్రికాలోనూ, మరికొన్ని నిరుపేద దేశాల్లోనూ వ్యాక్సిన్లు వేయడం ఇప్పటికీ స్వల్పంగానే ఉంది. గత రెండేళ్లుగా మహమ్మారి ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో అతలాకుతలం చేయడమే కాకుండా, దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దీంతో అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్‌ మహమ్మారులతో వ్యవహ రించడం ఎలాగని చర్చించుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతి పాదన కూడా వీటిలో ఒకటి. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రయత్నపు విజయం పలు కారణాలపై ఆధారపడి ఉంటుంది.

మానవ ఆరోగ్యం ప్రధాన సూత్రంగా లేకపోతే ఈ ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్‌–19ని ఎదుర్కోవడా నికి దేశాల మధ్య సహకారం చాలా అవసరమని స్పష్టమైంది. ఒక సాంకేతిక, శాస్త్ర సంబంధిత ఏజెన్సీ అయిన ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ సవాలును ఎదుర్కోవడానికి అవసరమైన వివిధ ప్రజారోగ్య, బయో మెడికల్‌ కొలమానాలపై మార్గదర్శకత్వాన్ని అందించింది. ఇది ప్రపంచ  వ్యాప్తంగా మహమ్మారికి చెందిన డేటాను నిర్దిష్టంగా పదిలపర్చే స్థలంలాగా పాత్ర పోషించింది. వైరస్‌ కట్టడిపై ఈ సంస్థ ఇచ్చే పిలుపును జాతీయ ప్రభుత్వాలే స్వీకరించి ఆచరణలో పెట్టాయి. మాస్కు ధరించడం, లాక్‌డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు వంటి వాటిని ఏజెన్సీ అందించిన సాంకేతిక సలహాను బట్టి, స్థానిక పరి స్థితిని బట్టి ఆయా దేశాలు పాటిస్తూ వచ్చాయి. 

అయితే చైనాలో వైరస్‌ మూలం గురించిన తనిఖీల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆరోపణలకు గురైంది. ప్రత్యేకించి చైనా పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా మృదు వైఖరి అవలంబించిందని కొన్ని పాలనా యంత్రాంగాలు విమర్శించాయి. మరోవైపున, దేశాలు స్వతంత్రంగా వైరస్‌ రూపాలపై పరిశోధన చేయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధికారాలు కుదించుకుపోతున్నట్లు భావించింది. వ్యాధి లేక వైరస్‌ సంబంధిత సమాచారం, డేటా కోసం సభ్య దేశాలపై ఆధారపడాల్సి ఉండటమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అతిపెద్ద అవరోధంగా ఉంటోంది.

2002–2003 సంవత్సరాల్లో సార్స్‌ వైరస్‌ ప్రపంచంపై విరుచుకుపడిన నేపథ్యంలో 2005లో అంతర్జాతీయ ఆరోగ్య క్రమ బద్ధీకరణ (ఐహెచ్‌ఆర్‌) చట్టాన్ని తీసుకొచ్చారు. సార్స్‌ వైరస్‌ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని చైనా నెలల తరబడి వెల్లడించకుండా తొక్కిపెట్టడంతో చాలా దేశాలకు అది విస్తరించింది. ప్రజారోగ్యానికి సంబంధించిన ఘటనలు దేశాల సరిహద్దులు దాటి సంభవించి నప్పుడు ప్రపంచ దేశాలు పాటించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నియమాలను ఐహెచ్‌ఆర్‌ నెలకొల్పింది. 2020 జనవరి 30న ఐహెచ్‌ఆర్‌ ఎమర్జెన్సీ కమిటీ నిర్వహించిన సమావేశం లోనే, కోవిడ్‌–19ని అంతర్జాతీయంగా కలవరపెట్టే ప్రజారోగ్య అత్యవ సర పరిస్థితిగా సిఫార్సు చేశారు.

అయితే ఐహెచ్‌ఆర్‌ బలహీనమైన చట్రంతో కూడుకుని ఉందనీ, పర్యవేక్షణ, నిఘా వంటి అంశాల్లో దాని అమలు లోపభూయిష్ఠంగా ఉందనీ అనుభవాలు తెలియజేస్తున్నాయి. మహమ్మారి వెలుగులో 2020 మే నెలలో ఐహెచ్‌ఆర్‌ వ్యవస్థ పనితీరు, దాని అమలు గురించి సమీక్షించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సభ (వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ)... ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. 2021 డిసెంబర్‌లో మహమ్మారి సన్నాహక చర్యలపై సరికొత్త అంతర్జాతీయ ఒడంబడికపై చేసిన కృషిని ఆరోగ్య సభ ఆమోదించింది. ప్రతిపాదిత ఒడంబడికపై చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తొలి ప్రశ్న ఏమిటంటే, ఈ ఒడంబడిక తీసుకునే రూపం చట్టానికి కట్టుబడి ఉండే ఉపకరణంగా ఉండాలా లేదా మరొకలా ఉండాలా అనేదే! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సమస్యలపై విధివిధానాలను రూపొందించే అధికారాలను ఆరోగ్య అసెంబ్లీకి కట్టబెట్టింది. ఇంత వరకు దీనికి సంబంధించిన ఏకైక ఉదాహరణ ఏమిటంటే, 2005లో అమలులోకి వచ్చిన పొగాకు నియంత్రణపై ముసాయిదా కన్వెన్షన్‌ మాత్రమే. ఈ కన్వెన్షన్‌ కింద పొగాకు ఉత్పత్తులలో అక్రమ వాణిజ్యాన్ని తొలగించే ప్రొటోకాల్‌ని అమలులోకి తెచ్చారు.

కొన్ని దేశాలు మహమ్మారిపై ఒడంబడిక విషయంలోనూ ఇలాంటి వైఖరినే పాటించాలని సూచించాయి. దీనికింద ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, నిర్దిష్ట విధివిధానాలతో కూడిన చట్రం ఉండాలని ఇవి కోరాయి. ఉదాహరణకు, జంతువుల నుంచి మను షులకు వ్యాపించే వ్యాధుల విస్తరణను నిరోధించేందుకు అడవి జంతువుల వ్యాపారంపై నిషేధం విధించే ప్రొటోకాల్‌ గురించి యూరోపియన్‌ యూనియన్‌ మాట్లాడుతోంది. కొత్త, ఆవిర్భవిస్తున్న వైరస్‌లపై జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ డేటాను తప్పనిసరిగా అన్ని దేశాలూ పరస్పరం పంచుకోవాలనే డిమాండ్లు కూడా రంగంమీదికి వచ్చాయి. అయితే ఈ కొత్త విధానం లేదా ఒడంబడిక ఐహెచ్‌ఆర్‌ని తోసి రాజంటుందా లేదా దానికి అనుబంధ పాత్రను పోషిస్తుందా అనేది స్పష్టం కావడం లేదు. ఈ అన్ని ఘర్షణాత్మకమైన అంశాలపై సంప్ర దింపుల కమిటీ ఒక అవగాహనకు రావాల్సి ఉంది.

ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి కొత్త నిబంధనలను అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు మనకు ఎదురైన అతి పెద్ద గుణపాఠాలను విస్మరించకూడదు. ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపం చంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్‌ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉండిపోయింది. సంపన్న దేశాల్లోని ప్రజలు ఇప్పటికే బూస్టర్‌ డోసులు కూడా వేసుకున్నారు. మరోవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వ్యాక్సిన్‌ పూల్‌ పేదప్రజలకు వ్యాక్సిన్లను అందించడంలో విఫలమైంది. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి.

భౌగోళిక–రాజకీయ వ్యూహాల పరంగా కఠినమైన స్థానాల నుంచి ప్రపంచ దేశాలు పక్కకు తొలిగేలా మహమ్మారి మార్పు తీసుకు రాలేక పోయింది. వాణిజ్య ఒప్పందాలలోనూ ఈ పరిస్థితే కొనసాగుతోంది. మేధా సంపత్తికి చెందిన అవరోధాలన్నీ చెక్కుచెదర కుండా అలాగే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్కనబెట్టి గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఎజెండా వంటి ప్రైవేట్‌ చర్యలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికా ఇలాంటి వాటిని ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో అందరికీ వర్తించే బహుపాక్షికత అనే గొప్ప భావనపై దాడి చేస్తూ వచ్చారు.

ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకు వస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. దశాబ్దాలుగా వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం ప్రపంచం చర్చిస్తూనే ఉంది. కర్బన ఉద్గారాలకు సంబంధించిన సూత్రాలను సంపన్న దేశాలు నిరంతరం వ్యతిరేకిస్తూ, ఉమ్మడి బాధ్యతలు చేపట్ట డానికి నిరాకరిస్తున్నాయి. పేద దేశాలకు టెక్నాలజీ బదలాయింపు, ఆర్థిక వనరుల పంపిణీపై చేసిన వాగ్దానాలు ఇప్పటికే కాగితాల మీదే ఉండిపోయాయి. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంత  వరకు మహమ్మారిపై కుదిరే ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుందని విస్మరించరాదు.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top