బాబు ప్రచార ప్రగల్భాలు–వాస్తవాలు | Sakshi
Sakshi News home page

బాబు ప్రచార ప్రగల్భాలు–వాస్తవాలు

Published Fri, Apr 12 2024 12:34 AM

Sakshi Guest Column On Chandrababu Election Campaign

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే మిగిలాయి. దీనితో, వాతవరణం లానే ప్రచార పర్వం కూడా వేడెక్కింది. ఒక వైపు జగన్‌ ‘మేమంతా సిద్ధం’ సభల జన సునామీ ఉధృతి రోజు రోజుకీ పెరిగి పోతుంటే, మరో వైపు ‘ప్రజా గళం’ పేరుతో చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు. ఇప్పటికే విశ్వసనీయత పలుమార్లు కోల్పోయిన చంద్రబాబు ఎన్నికల సభల్లో చేస్తున్న అనేక సత్యదూరమైన ప్రకటనల్లో కొన్నింటిని ఇక్కడ చర్చించాలి.

కొవ్వూరు సభలో ఆయన ‘తమ్ముళ్ళూ, నేనెప్పు డైనా విద్యుత్‌ ఛార్జీలు పెంచానా?’ అని అడగడం చూస్తుంటే ప్రజల మేధస్సుపై ఆయనకు ఇంత చిన్న చూపు ఏంటి అని అనిపిస్తోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఉంటూ దేశం లోనే ఆనాటికి రికార్డు స్థాయిలో కరెంట్‌ చార్జీలు అకస్మాత్తుగా పెంచితే లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కి ధర్నాలు, దీక్షలు చేపట్టిన ఘట్టం ఆయన మరిచినంత తేలిగ్గా జనం మరుస్తారా? ఆ నిరసన స్వరాలను ఉక్కు పాదంతో తొక్కి పోలీసు కాల్పులు జరిపించి ముగ్గురి విలువయిన ప్రాణాలను పొట్టన పెట్టుకున్న  వైనం ఇప్పటికీ ‘బషీర్బాగ్‌ ఉదంతం’గా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉండగా ఈయన ఈ విధంగా అసత్య ప్రేలాపనలు చేయడం అసమంజసం.

పామర్రు సభలో హైటెక్‌ సిటీ ప్రస్తావన తెచ్చి ‘ఇక్కడే అలాంటి టవర్‌లు కడతాను’ అని చెప్పారు. ఇలాంటి డాంబికాలు పచ్చ‘కామెర్లు’ వచ్చిన వారికి రుచించవచ్చుగానీ కొంచెం అయినా ఆలోచించే జనం అటువంటి ప్రకటనలను శంకించక మానరు. అసలు ఐటీ అంటే చంద్రబాబు అని జరిగిన ప్రచారం... ఉన్న దాన్ని చిలవలు పలవలు చేసిన చందంగా జరిగింది.

ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన ఒరవడిలో చెన్నై,బెంగుళూరు వంటి నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్‌ కూడా ఐటీ హబ్‌ అవ్వడం జరిగింది. అయితే, ఇతర రాష్ట్రాల్లోని అప్పటి ముఖ్యమంత్రులకు రాని ఖ్యాతిని చంద్రబాబుకి చేకూర్చడంలో ఆయన ప్రచార కౌశల్యం, అడక్కుండానే వండి వార్చే అస్మదీయ మీడియా సహకారం పాత్ర మరవరానిది. ఒక అర్ధ సత్యాన్ని వందల, వేల సార్లు నొక్కి వక్కాణిస్తే అది ఏవిధంగా చరిత్రలో స్థిరీకరించుకుపోతుందో ఈ ‘చంద్ర బాబు–ఐటీ’ ఉదంతం ఒక బలమైన ఉదాహరణ. 

ఆయన 2004లో అదే హైదరాబాద్‌ సిటీలో, హైటెక్‌ సిటీ పరిసర నియోజకవర్గాల్లో కూడా చిత్తుగా ఓడిపోయిన మాట వాస్తవం. అంటే, ఈయన చెప్పుకునే అభివృద్ధి అక్కడ శ్రామిక జనాలకు ఏ మాత్రం ఉప యోగ పడలేదు అనేది సుస్పష్టం. అలాగే, హైదరాబాద్‌ నగరం చంద్రబాబును వదిలించుకుని ఇప్పటికి 20 ఏళ్లు దాటినా, ఇంకా ఐటీ రంగంలో అగ్రగామిగా ఎందుకు ఉంది? ఈయన తరవాత వచ్చిన ప్రభుత్వాలకు అందులో పాత్ర లేదా? నిజానికి, ఆయన తదనంతర పాలనలోనే హైదరాబాద్‌  విపరీతంగా అభివృద్ధి చెందింది అని కూడా చెప్పొచ్చు. అందుకే, అభివృద్ధి అనేది ఒక్క వ్యక్తి ద్వారా వచ్చి పడే విషయం కాదు. ఒక నగరానికి, ప్రాంతానికి ఉన్న భౌగోళిక, చారిత్రక, స్వాభావిక నేపథ్యాల వల్ల సాధ్యమయ్యే విషయం.

పెనమలూరు ప్రచార సభలో చంద్రబాబు ‘సంపద సృష్టిస్తా’ అని అరిచి గీ పెట్టారు. అసలు ‘సంపద సృష్టి’ అంటే ఏంటి? నేల విడిచి సాము చేసి, గ్రాఫిక్స్‌తో మాయ చేసి, తిమ్మిని బమ్మిని చేయడం సంపద సృష్టి అవుతుందా? ప్రపంచ బ్యాంకు షర తులకు తలొగ్గి, దావోస్‌ పర్యటనలకు వెళ్లి విశ్వవ్యాప్త పెట్టుబడిదారీ రాబంధుల అడుగులకు మడుగులొత్త డమా సంపద సృష్టి అంటే? అణగారిన వర్గాల భూముల్లో జయభేరీలు, ఫోరమ్మాళ్లూ కట్టడమా సంపద సృష్టి అంటే? వేల సంవత్సరాల వివక్ష వల్ల నలిగిపోయి ఉన్న బతుకులను కొత్త ప్రపంచపు ఎండ మావుల మిరిమిట్లను చూపి మళ్ళీ దగా చేయడమా సంపద సృష్టి అంటే? నిజమైన సంపద సృష్టి అంటే కింది జనాలకు నాణ్యమైన విద్యను అందించడం కాదా? వారికి కావాల్సిన ఆర్థిక చేదోడు ఇచ్చి నేను ఉన్నాను అని వెన్ను తట్టే ప్రభుత్వమే సంపద సృష్టికి నాంది పలుకుతుంది. ఈ రాష్ట్రంలో ఒక తరం పేద పిల్లలు అందరూ ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ చదువులు నేర్చుకుంటే కలిగే మానవ వనరుల సంపద వంద చంద్రబాబులు వెయ్యి రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలాలు చేసినా ఒనగూడదు.

పల్నాడులో మాట్లాడుతూ బాబు శవ రాజకీయాల ప్రస్తావన చేశారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 2015లో ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల జరిగిన తొక్కిస లాటలో 29 మంది అమాయక భక్తులు శవాలుగా మారిన దుర్ఘటన మరవరాదు. అలాగే,  2022 డిసెంబర్‌ 29న కందుకూరులో ఈయన అత్యుత్సాహంతో ఇరుకు సందుల్లో సభ పెట్టడం వల్ల 8 మంది చనిపోతే, 4 రోజులు తిరగకుండానే గుంటూరులో చీరల పంపిణీ పేరున మరో తొక్కిసలాట జరిగి ముగ్గురు శవాలుగా మారారు. ఆ నిస్సహాయ, పేద ప్రజల శవాలు బాబు రాజకీయ ప్రస్థానంలో సమిధలు.

మొత్తానికి, ఈ విషయాలన్నీ గమనిస్తే మనకు అవగతమవుతున్న దేంటంటే చంద్రబాబు నాయుడు దృష్టి కోణంలోనే లోపం ఉంది. అందులో ప్రజల సంక్షేమానికి తావు లేదు. ఉన్నదల్లా అభూత కల్పనపై మక్కువ, కల్పిత స్వీయ చరిత్రపై ఎనలేని అతి విశ్వాసం. వీటిని రాష్ట్ర ప్రజలు సమూలంగా మరోసారి తిరస్కరిస్తారని ఆశిద్దాం.

డా‘‘ జి. నవీన్‌ 
వ్యాసకర్త సామాజిక ఆర్థిక అంశాల విశ్లేషకులు

Advertisement
 
Advertisement