పోషకాహార లోపాలు ఇంకానా?

Sakshi Guest Coloman On National Family Health Survey

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి పెరిగింది. ఈ మార్పు సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుంది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. జనాభాలో సగం మందిలో ఐరన్‌ తాలూకూ శక్తి లోపిస్తోంది. ఆడపిల్లలు, మహిళల్లో రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ట్వీట్లు, స్మార్ట్‌ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది.

భారతదేశం అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించి నప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఫ్యాక్ట్‌ షీట్స్‌ వెలువడ్డాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒక్కసారి వీక్షిస్తే మిశ్రమ ఫలి తాలు కనిపిస్తాయి. కొన్ని హర్షణీయమైన అంశాలతోపాటు దిగాలు పడాల్సినవీ దీంట్లో ఉన్నాయి. ఒక శుభవార్త ఏమిటంటే.. భౌగోళిక పోకడల విషయంలో మరీ ముఖ్యంగా లింగ నిష్పత్తిలో కొంత మార్పు కనిపిస్తూండటం!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో మొట్టమొదటిసారి చేపట్టన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. అంతేకాదు. పుట్టుక సమయంలో లింగ నిష్పత్తి ప్రస్తుతం 929 (2015–16 నాటి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4లో ఇది వెయ్యి మంది పురుషులకు 919గా నమోదై ఉంది)కి చేరుకుంది. సాఫల్యత రేటు 2.2 శాతం నుంచి రెండు శాతానికి పడిపోవడమూ ఆనందం కలిగించే విషయమే. సాఫల్యత రేటు తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో మరింత తగ్గిపోయినట్లుగా కనిపిస్తూంటే.. అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పెద్దగా తేడా ఏమీ లేకుండా పోయింది. ఈ తేడా సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్నది తెలిసిందే. పూర్తిస్థాయి నివేదిక అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వివరాలు విధాన రూపకల్పనలో, సామాజిక స్థాయిలో ఈ అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. 

దేశవ్యాప్తంగా మహిళ సాధికారత, బాలికల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అవలంబిస్తున్న విధానాలు, ప్రచారాల పుణ్యమా అని ఇప్పుడు ఎంతో కొంత ప్రగతినైతే సాధించాం. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదల, సాఫల్యత రేటులో తరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. సాక్షరత విషయంలో ఎంతో అభివృద్ధి నమోదవుతోంది. పదేళ్ల బడిని పూర్తి చేసుకున్న మహిళలు, పురుషుల శాతం కూడా ఎక్కువై 41 శాతం, 50.2 శాతానికి చేరుకుంది. కానీ చేయాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉంది. ఎందుకంటే ఈ అంకెలు మన శ్రామిక వర్గంలో సగానికపైగా తగిన నైపుణ్యం, అర్హతలకు దూరంగా ఉన్నారని చెబుతున్నాయి. వీటిని సాధించడం ద్వారా మాత్రమే అట్టడుగు శ్రామికులు పేదరికం చట్రం నుంచి బటయపడగలరు.
ఆసుపత్రుల వంటి సంస్థల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడం మాత్రమే కాదు... మాతా శిశు సంక్షేమం, పసిపిల్లల టీకా కార్యక్రమం (ఏటా రెండు శాతం వృద్ధి)లో ప్రగతి సాధించిన ఖ్యాతి ఆరోగ్య రంగానికే దక్కుతుంది. కాన్పుల సమయంలో తల్లీబిడ్డల్లో మరణాలు ఒక శాతం వరకు కూడా తగ్గడం ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లోనూ 1.6 శాతం తగ్గుదల నమోదు కావడం విశేషమే. 

ఈ అంశాల మాటేమిటి?
ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. కొంచెం ఆందోళన కలిగించే అంశాలు ఇలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15 – 49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతూండటం ఆందోళనకరమే. ఇంకోలా చెప్పాలంటే జనాభాలో సగంమందిలో ఐరన్‌ తాలూకూ శక్తి లోపిస్తోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇదేమంత మంచి విషయం కాదు. 

రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని వర్గాల్లోనూ కనిపిస్తూంటాయి. శారీరక, మానసిక అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా పిల్లలు, కౌమారుల్లో ఉండాల్సిన చురుకుదనాన్నీ తగ్గించేస్తుంది. ఆటలు, నేర్చుకునే శక్తినీ హరిస్తుంది. తద్వారా వారు సమర్థమైన ఉత్పాదకత కలిగిన పౌరులుగా ఎదగడం వీలుపడదు. పనిచేసే సామర్థ్యం తగ్గడం, తొందరగా అలసిపోవడం వల్ల ఉత్పత్తి, ఆదాయం రెండూ తగ్గిపోతాయి. అంతేకాదు.. కౌమార వయస్కులైన బాలికల్లో దాదాపు 59.1 శాతం మందిలోని రక్తహీనత కాబోయే తల్లులపై ప్రభావం చూపుతోంది. కాన్పు సమయంలో మాతా శిశువుల మరణానికి ప్రధాన కారణంగా మారుతోంది. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. గతంతో పోలిస్తే కొంత మెరుగుదల ఉన్నప్పటికీ గర్భిణుల్లో ఐఎఫ్‌ఏ ట్యాబ్లెట్ల వాడకం ఇప్పటికీ తక్కువగా ఉంది. (41 శాతం మంది వంద రోజులపాటు తీసుకోగా, 26 శాతం మంది 180 కంటే ఎక్కువ రోజులు తీసుకున్నారు). ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యామో పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాత స్పష్టత వస్తుంది. 

ఇంకో ఆందోళనకరమైన విషయం అన్ని వయసుల వారిలోనూ పౌష్టికతను సూచించే అంశాల్లో పెరుగుదల అతితక్కువగా (ఏడాదికి 0.5 శాతం) ఉండటం. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5ల మధ్య అవసరానికంటే ఓ మోస్తరు బరువు తక్కువన్న ఐదేళ్లలోపు పిల్లల శాతం 35.8 నుంచి 32.1 శాతానికి తగ్గింది. ఎదుగుదల తగ్గిన పిల్లల శాతం కూడా 38.4 నుంచి 35.5 శాతానికి మాత్రమే తక్కువైంది. సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల ఓ మోస్తరుగా మాత్రమే లేని వారు 21 శాతం నుంచి 19.3 శాతానికి తగ్గారు. ఇదే సమయంలో సామర్థ్యానికి తగ్గ ఎదుగుల లేమి తీవ్రంగా ఉన్న వారు 7.5 నుంచి 7.7 శాతానికి పెరగడం గమనార్హం. రెండేళ్ల లోపు వయసు వారు తగిన ఆహారాన్ని తీసుకోని వారు 11.3 శాతం వరకూ ఉన్నారు. దీని వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయన్నది నిర్వివాద అంశం. గత ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సమయంలో ఇది 9.6 శాతం మాత్రమే. ప్రాథమిక స్థాయిలో జరుగుతున్న ఈ పౌష్టికాహర లేమిని విధానకర్తలు, నిపుణులు... పౌష్టికాహర రంగంలో పనిచేస్తున్న వారు విస్మరిస్తూండటం ఎంతైనా ఆందోళన కలిగించే అంశం. ఈ లోపాన్ని సరిదిద్దకుండా పౌష్టికాహార సూచీల్లో చెప్పుకోదగ్గ మార్పులు అసాధ్యమనే చెప్పాలి. 

అందనంత ఎత్తులో ఇరుగుపొరుగు...
కుటుంబ ఆరోగ్యం విషయంలో ఇరుగు పొరుగు దేశాలు మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చైనాలో అటు పురుషులైనా, ఇటు మహిళలైనా వంద శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు. రక్తహీనత, 15–59 మధ్య వయస్కులైన మహిళల్లో 16 శాతం మాత్రమే ఉండగా.. ఎదుగుదల లోపం ఐదు శాతం మందిలో, సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల లేదు. ఇటీవలి వరకూ ఎంతో వెనుబడి ఉన్న బంగ్లాదేశ్‌ కూడా వేగంగా పుంజుకుని.. మనల్ని మించిపోయింది. 

దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ఆంబులెన్స్‌ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్‌ అండ్‌ ఛైల్డ్‌ హెల్త్‌ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగాలి. సమగ్ర శిశు సంక్షేమ సేవల (ఐసీడీఎస్‌) కార్యక్రమాలను సమీక్షించుకుని ఆచరణ సాధ్యమైన ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలను అందించేలా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారం సాధ్యం కాదు. ట్వీట్లు, స్మార్ట్‌ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి ఉంటుంది.!
– వీణా రావు, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top