పనికిరాని పీఐఓలను పంపించాల్సిందే

 PIOs Who Mechanically Reject RTI Applications Should Be Dismissed - Sakshi

విశ్లేషణ

సెప్టెంబర్‌ ఏడో తేదీన మద్రాస్‌ హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. యాంత్రికంగా ఆర్టీఐ దరఖాస్తులను తిరస్కరించే పీఐఓలను ఉద్యోగం నుంచి పంపించేయాలని సూచించింది. అటువంటి పీఐఓలు ఆ పదవుల్లో ఉండడానికి అర్హులు కాదని వ్యాఖ్యానించింది. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, 2006, 07, 08 సంవత్సరాలలో ఎన్ని ఖాళీలు, వాటిలో ఎన్ని వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అలాగే బీసీలకు, చాలా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన స్థానాలలో ఎంపికైన వన్నియకుల శత్రియర్‌ జాబితా ఇవ్వండి అని ముత్యన్‌ ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖలుచేశారు. 

పీఐఓ ఈ దరఖాస్తును తిరస్కరించారు. చివరి రెండు పాయింట్ల సమాచారం ఇవ్వడానికి వీలే లేదట. ఆ సమాచారం వెల్లడిస్తే ఆయా ఉద్యోగుల ప్రైవసీని భంగపరిచినట్టు అవుతుందని, అంతేగాకుండా విభిన్న కులాల మధ్య చిచ్చుపెట్టినవారమవుతామని వారు వాదించారు. దీన్ని సవాలుచేస్తూ రెండో అప్పీలు తమిళనాడు సమాచార కమిషన్‌ దాకా వెళ్లింది. కమిషన్‌ ఈ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ రాష్ట్ర హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కులాల వారీగా విభజించి పట్టికలు ఇవ్వడం పబ్లిక్‌ యాక్టివిటీతో సంబంధం లేని పననీ, టీఎన్‌పీఎస్‌సీ రాజ్యాంగ విధులు నిర్వర్తించే సంస్థ అనీ, కులాల వివరాలు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత దీనిపై ఉందని, ఇందువల్ల కుల పోరాటాలు, అల్లర్లు కూడా జరగవచ్చునని నోటికి వచ్చిన కారణాలు అల్లి సమాచారం నిరాకరించారు.

‘‘చాలా ధైర్యంగా కమిషన్‌ తీసుకున్న అరుదైన నిర్ణయాలలో కెల్లా అరుదైన నిర్ణయం ఇది అయి ఉండాలి. ఈ కేసులో సమాచార కమిషన్‌ తీర్పును కాదనే అవకాశమే లేదు’’ అని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొనడం విశేషం. రిట్‌ వేయతగిన తప్పేదీ కనిపించడం లేదని కూడా హైకోర్టు పేర్కొన్నది. కనీసం తాము పేర్కొంటున్న సెక్షన్‌ 8 క్లాజ్‌లు వర్తిస్తాయో లేదో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు సెక్షన్ల నంబర్లు రాసి దరఖాస్తులు తిరస్కరించే ఇటువంటి అధికారులకు గుణపాఠం చెప్పాలి. వారు ఈ పదవుల్లో ఉండేందుకు అర్హులు కాదు. వారిని బయటికి పంపించాల్సిందే. లేదా వారిపైన ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌ సెప్టెంబర్‌ 7 నాటి తీర్పులో వ్యాఖ్యానించారు. ఈ తప్పు చేసిన అధికారులు ఇంకా సర్వీసులో ఉన్నారా? అని అడిగారు. దానికి వారు జవాబు ఇవ్వలేదు. నెలరోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. రిట్‌ పిటిషన్‌ని డిస్మిస్‌ చేసింది.  

ఈ విధంగా అడిగిన సమాచారం ఇవ్వకపోగా, సమాచార కమిషన్‌ ఆదేశాలను కూడా తిరస్కరించింది తమిళనాడు పీఎస్సీ. చట్టం ప్రకారం సమాచార కమిషన్‌ తీర్పు తుది తీర్పు అవుతుంది. తీవ్రమైన ప్రక్రియలోపాలు, సంవి ధాన సంక్లిష్టమైన అంశాలు ఏవైనా ఉంటే రిట్‌ పిటిషన్‌ వేసుకోవచ్చు. మెరిట్‌ పైన మూడో అప్పీలు ఉండదు. పది రూపాయల ఫీజుతో సమాచారం అడిగే పేదవాడు సామాన్యుడు, సమాచార కమిషన్‌ దాకా రాగలుగుతాడు, నిలువగలుగుతాడు. హైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు. పబ్లిక్‌ అథారిటీలు మాత్రం ఈ అధికారాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టంవచ్చినట్టు రిట్లు వేస్తున్నాయి. సమాచార కమిషన్‌ దాకా వచ్చి గెలిచినా ప్రభుత్వ సంస్థలు డబ్బు, అధికారబలంతో, తమ అనుయాయులయిన లాయర్లకు జనం డబ్బు కట్టబెట్టవచ్చనే లక్ష్యంతో, సమాచార కమిషన్లపైన కోర్టు పోరాటం చేస్తున్నాయి. పగ బట్టిన లిటిగెంట్‌కు ప్రభుత్వానికి తేడాయే లేదా? రిట్‌ వేయవచ్చుననే రాజ్యాంగ అవకాశాన్ని నియమాల్ని దుర్విని యోగం చేస్తూ, సమాచార హక్కును సామాన్యుడికి నిరాకరించాలని తద్వారా రాజ్యాంగం ఇచ్చిన వాక్‌ స్వాతంత్య్రాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ పేద దరఖాస్తుదారుడిని హైకోర్టుకు లాగుతున్నాయి ప్రభుత్వ సంస్థలు. 

సమాచార కమిషనర్లు చాలామంది సమాచారం ఇప్పించే హక్కు చట్టానికి వ్యతిరేకంగా నిరాకరిస్తూ ఉంటారు. వారు అవినీతి యంత్రాంగానికి, రాజకీయ ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్యుడి హక్కును మట్టిపాలు చేస్తుంటారు. ఆ సామాన్యుడు కమిషన్‌లో గెలిస్తే సంతోషిస్తాడు. కానీ పగబట్టిన ప్రభుత్వం అతన్ని హైకోర్టుకు కూడా లాగుతుంది. ఇంకా మొండి పట్టుదలతో సుప్రీంకోర్టుకు ఈడ్చుతుంది. సమాచార కమిషన్‌లో ఓడిపోతే సామాన్యులలో చాలామంది హైకోర్టులో రిట్‌ వేయరు. కానీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదు. ప్రభుత్వ సంస్థ వేసిన రిట్‌ను హైకోర్టులో వ్యతిరేకించే వారెవరూ ఉండరు. ఎందుకంటే సమాచారం కోరిన వ్యక్తి లాయర్‌ను నియమించుకోలేడు. సమాచార కమిషన్‌ వాదించడం జరగదు. సామాన్యుడి హక్కును నిలబెట్టే న్యాయమూర్తి ఎవరైనా సహృదయంతో స్పందిస్తే సమాచారం బయటకు వస్తుంది. చాలాకాలం తరువాత ఇటువంటి తీర్పురావడం సంతోషదాయకం. ఇలాంటి సమాచార కమిషనర్లు, హైకోర్టు న్యాయమూర్తులు ఉంటే పీఐఓ నిజాయితీతో సమాచారం ఇస్తే ఆర్టీఐ బతుకుతుంది.

వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌ , బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top